‘నా రక్తం, చెమట, కన్నీళ్లను కలగలిపి ధైర్యంగా నూరిపోసుకుని కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడ్డాను’.. గతేడాది డిసెంబర్‌లో మిస్ ఇండియా ప్రారంభ పోటీల సమయంలో మాన్యాసింగ్ చెప్పిన మాటలివి. పేదరికం కారణంగా చిన్నతనంలోనే ఎన్నో ఇళ్లల్లో పాచి పనులు చేసిన ఆమె మిస్ ఇండియా పోటీల దాకా వచ్చిందంటే అది సాధారణ విషయమేమీ కాదు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను దాటాకే ఇక్కడకు వచ్చానంటూ తన విజయ ప్రస్థానాన్ని సూటిగా నాలుగు మాటల్లో చెప్పే ప్రయత్నం చేసిందీ అందాల తార.
డబ్బులు మిగులుతాయని నడిచే వెళ్లేదాన్ని!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగర్‌కు చెందిన మాన్యాది నిరుపేద కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. రోజంతా కష్టపడి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కానీ ఇంట్లో వారందరి కడుపు నిండేది కాదు. దీంతో ఎన్నోసార్లు ఖాళీ కడుపుతో పస్తులుండి నిద్రలేని రాత్రులు గడిపింది మాన్య.
‘ఇంటి ఖర్చులకు నాన్న సంపాదన ఏ మాత్రం సరిపోయేది కాదు. అందుకే నా చిన్నతనంలోనే ఎన్నో ఇళ్లల్లో పనులు చేయాల్సి వచ్చింది. డబ్బులైపోతాయని ఎన్నో మైళ్లు నడిచే వెళ్లేదాన్ని. పొదుపు చేసిన డబ్బులతో పుస్తకాలు, దుస్తులు కొనుక్కోవాలని ఉండేది. కానీ నాకంత అదృష్టం దక్కలేదు’..!
-మాన్య సింగ్
ఆటో డ్రైవర్ కూతురని దూరం పెట్టారు!
‘విద్య అనేది విలువైన, బలమైన ఆయుధమని నేను గట్టిగా నమ్ముతాను. నేను కూడా అందరిలాగే పెద్ద చదువులు అభ్యసించాలనుకున్నాను. అందుకు తగ్గట్టే హెచ్‌ఎస్సీ చదువుతున్న సమయంలో బెస్ట్ స్టూడెంట్‌గా అవార్డు గెలుచుకున్నాను. అయితే ఈ అవార్డు గెలుచుకోక ముందు రోజు వరకూ నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా స్కూల్, పరీక్ష ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న కొద్ది పాటి బంగారాన్ని కూడా అమ్మానాన్నలు అమ్మేశారు. పుస్తకాలు కొనలేక ఎన్నో అవస్థలు పడ్డాను. ఇక ఆటో డ్రైవర్ కూతురన్న కారణంతో తోటి విద్యార్థులు కూడా నన్ను దూరం పెట్టేవారు. నేను అందంగా లేనంటూ, సరిగ్గా మాట్లాడలేనంటూ కామెంట్లు చేసేవారు. ఈ క్రమంలోనే ఎలాగైనా సరే పెద్ద మోడల్ అవ్వాలన్న కలతో 14 ఏళ్ల వయసులో ఇంటిని వదిలేసి ముంబయికి చేరుకున్నాను. పగలు చదువు, సాయంత్రం ఇళ్లల్లో పనులు, రాత్రుళ్లు కాల్ సెంటర్లలో పనిచేశాను. ఇక్కడ ఆటో డబ్బులు ఆదా అవుతాయని చాలా దూరం నడిచి వెళ్లేదాన్ని’ అని తన గతాన్ని గుర్తు చేసుకుందీ ముద్దుగుమ్మ.
అదే నా అసలైన విజయం!
ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలన్న క్రమంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులను ధైర్యంగా అధిగమించింది మాన్య. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అందాల పోటీల్లో విజేతగా నిలిచి ఫెమినా మిస్ ఇండియా పోటీలకు అర్హత సాధించింది. ముంబయి వేదికగా తాజాగా జరిగిన ఈ పోటీల్లో ఆమె విజయం సాధించకపోయినా రన్నరప్‌గా నిలిచింది. అందాల కిరీటం దక్కకపోయినా ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై నిలబడడమే తన విజయమంటూ అందరినీ ఆకర్షించింది.
‘ఈ వేదికపై నిలబడాలని నేను ఎన్నో కలలు కన్నాను. నా కలను సాకారం చేసుకునే క్రమంలో ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొన్నాను. అసలు ఇక్కడ వరకు రావడమే నా అసలైన విజయం. ఇక మా అమ్మ, నాన్న, తమ్ముడి బాధ్యతలన్నింటినీ నేనే తీసుకుంటాను. మోడలింగ్‌ను కొనసాగిస్తూనే మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఉన్నత చదువులు అభ్యసించాలనుకుంటున్నాను’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ అందాల తార.
సో.. చూశారుగా.. మిస్ ఇండియా పోటీల్లో అందాల రాణిగా మెరిసిన మాన్య మెరుపుల వెనుకనున్న కన్నీటి కథ. అడుగడుగునా అడ్డంకులు, అవమానాలు ఎదురైనా వెరవకుండా తన కలను సాకారం చేసుకున్న ఆమె విజయం నేటి తరానికి స్ఫూర్తి మంత్రం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ సందర్భంగా మోడలింగ్ రంగంలో మాన్య మరిన్ని మైలురాళ్లను అధిరోహించాలని కోరుకుందాం.
ఇదీ చూడండి: ఆటోలో మిస్ ఇండియా రన్నరప్.. శభాష్ అంటున్న నెటిజన్లు