విలాసవంతమైన కార్లు, బైక్‌లు నడపాలని చాలామందికి ఉంటుంది. కొనాలంటే రూ.కోట్లు కావాలి. మరి ఆ సరదా ఎలా తీర్చుకోవాలి..? మీ కోసమే అన్నట్లు హైదరాబాద్లో నగరంలోని పలు ఏజెన్సీలు ముందుకొస్తున్నాయి. అద్దె ప్రాతిపదికన ఖరీదైన కార్లు, బైక్‌లను అందిస్తున్నాయి. నానో నుంచి లాంబోర్గినీ వరకు అన్ని రకాల కార్లు ఇస్తున్నారు.
ఇవి తప్పనిసరి..
అద్దెకు తీసుకోవాల్సిన వారు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ నకలు నిర్వాహకులకు ఇవ్వాలి. కొంత నగదు డిపాజిట్ చేయాలి. వాహనం తిరిగిచ్చాక ఏడు రోజులకు ఆ డబ్బు ఇస్తారు. డిపాజిట్ కింద రూ.1000 నుంచి రూ.3000, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.10వేల నుంచి రూ.60వేల వరకు తీసుకుంటున్నారు. నెలల తరబడి అద్దెకు కూడా ఇస్తున్నారు.
వారాంతాల్లో ఎక్కువ వస్తున్నారు..
"బీఎండబ్ల్యూ, బెంజ్, ఆడీ తదితర కార్లను అందిస్తున్నాం. పర్యాటకానికి డిమాండ్ పెరిగితే ఈ బిజినెస్ బాగా ఉంటుంది. ప్రస్తుతం వారాంతాల్లో ఎక్కువ మంది వస్తున్నారు. పెళ్లిళ్ల సమయంలో ఎక్కువగా ఈ కార్లను వినియోగిస్తున్నారు".
--షాహిద్, రెంటల్ కార్స్
25 లగ్జరీ కార్లు ఉన్నాయి..
"బీఎండబ్ల్యూ లేదా ఆడీ కారు 8 గంటలకు రూ.7000, జాగ్వార్ కారుకు రూ.10,000 చెల్లించాలి. పరిధి దాటితే బీఎండబ్ల్యూ, ఆడీ కార్లకు కి.మీకు రూ.80, జాగ్వార్ కారుకు రూ.90 వసూలు చేస్తున్నాం. వీటిని నడపడానికి దేశ, విదేశాల పర్యాటకులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు"
-- సయ్యద్, సైబర్ ట్రావెల్స్