Sankranti 2022: సంక్రాంతి సంరంభం ఒక నెల ముందే ధనుర్మాసంతో మొదలవుతుంది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ధనుర్మాసం నెలరోజులు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధం తిరుప్పావైని పఠిస్తారు. ఈ నెలరోజులు వైష్ణవాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఈరోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ తరవాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశుల్లో కొనసాగినంత కాలం ఉత్తరాయణం. ఉత్తరాయణంలో మరణించిన జీవుడు ఉత్తర దిక్కుగా ప్రయాణించి సద్గతులు పొందుతాడని శాస్త్ర వచనం.
సంక్రాంతి మూడురోజుల పండుగ. మొదటిరోజు భోగి. ఈ రోజుతో నెలరోజులు ఉత్సాహంగా సాగిన ధనుర్మాసం ముగుస్తుంది. గోదాదేవి మార్గళివ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతం చేపట్టి నారాయణుని కొలిచి శ్రీరంగనాథుడి అనుగ్రహం పొందిన రోజు భోగి. ఈ పండుగను జ్ఞానానికి సూచికగా చెబుతారు.
రెండో రోజు పెద్ద పండుగ సంక్రాంతి. ఈ రోజున నువ్వుల దానం, నల్ల నువ్వులతో హోమం చేయడం వల్ల శని దోష నివృత్తి, అకాల మృత్యుదోషం నివారణ అవుతాయంటారు. ఈరోజు కూష్మాండ దానం చేయడం ఆచారం. గుమ్మడిపండు దానం చేస్తే సకల బ్రహ్మాండాన్ని విష్ణుమూర్తికి దానం చేసిన ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఉత్తరాయణం దేవతలకు ప్రీతికరం. స్వర్గస్థులైన కుటుంబ పెద్దలను తలచుకుంటూ పితృదేవతలకు సద్గతులు కలగాలని సంక్రాంతి నాడు తర్పణాలు విడుస్తారు.
ధనుర్మాసంలో మరో ముఖ్య విశేషం ఉదయాన్నే వీనులవిందు చేసే హరిదాసుల హరినామ కీర్తనలు. తెలుగువారి జానపద కళారూపం గంగిరెద్దుల ఆటలు ఈ పండుగ ప్రత్యేకత. గంగిరెద్దుల వారికి దుస్తులు, కానుకలు సమర్పించి ఆదరించడం మన సంప్రదాయం.
సంక్రాంతి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకొంటారు. ఉత్తర భారతంలో సంక్రాంతిని మాఘీ అని పిలుస్తారు. మధ్యభారతంలో సుకరాత్ అని, అస్సామ్‌లో మఘ్ బిహు అని, తమిళనాడులో పొంగల్ అని అంటారు. మూడోరోజు కనుమ. ఇది ప్రధానంగా వ్యవసాయదారుల పండుగ. కనుమనాడు పశువులను పూజిస్తారు.
సంక్రాంతి వైభవం బంధుమిత్రులను కలుపుతుంది. మనసులను దగ్గర చేస్తుంది. అనుబంధాల ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. దానధర్మాలను ప్రోత్సహిస్తుంది. ధర్మాచరణను ప్రేరేపిస్తుంది.
- ఇంద్రగంటి నరసింహమూర్తి
ఇదీ చూడండి: Sankranti Festival Special story 2022: ఈ సంక్రాంతి వెలుగులు మనవే!!