శుభప్రదమైన సౌభాగ్యవంతమైన ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకొంటున్నందుకు ఆనవాళ్లు- జలజలా రాలుతున్న విశ్వాసుల కన్నీళ్లు. అల్లాహ్ ఎదుట సజ్దాల్లో వేడుకున్న ప్రార్థనలు ఫలించాయన్న నమ్మకానికి అవి సాక్ష్యాలు. ముప్ఫై దినాల కఠిన ఉపవాస దీక్షతో ఆత్మ ప్రక్షాళన అయిన దివ్యానుభూతి కలుగుతుంది. తమ సిరిసంపదలనుంచి రెండున్నర శాతం జకాత్ దానాలు చేసి సంతృప్తితో పండుగ రోజున సమాయత్తమైన మనసులవి. కుటుంబంలోని ప్రతి వ్యక్తిపేర చేసిన ఫిత్రా దానాలతో రంజాన్ పర్వదిన సంతోష సంభ్రమాలు ఇనుమడిస్తాయి. అందరూ కలిసి ఈద్‌గాహ్‌లో చేసే సామూహిక నమాజుతో ఆకాశంలోని దైవదూతలు ఆనందించే క్షణాలివి. ఆనంద బాష్పాలతో ఒకరి శుభాల కొరకు మరొకరు అందించుకునే శుభాకాంక్షలు మానవాళికి చేకూరే అల్లాహ్ దీవెనలు!
ధర్మాన్ని పరిత్యజిస్తే..
సమాజంలోని బీదసాదల పట్ల సానుభూతి చూపి సహనం వహించిన ఈ రంజాన్ మాసానికి ప్రతిఫలం స్వర్గమని దివ్య ఖుర్‌ఆన్ చెబుతోంది. మనిషి పాపరహితంగా జన్మిస్తాడు. చేసిన చెడు కర్మలు పాపాత్ముడిగా మారుస్తాయి. అల్లాహ్‌కు ప్రత్యక్షంగా క్షమాభిక్షకై అర్థించి పశ్చాత్తాపపడి చేసిన తప్పులు మరల చేయకుండా నిర్మలాంతరంగులైతే తప్పక మన్నింపు పొందగలడని ఇస్లాం ధర్మోపదేశం చేస్తుంది. ఎవరైనా తమ ధర్మాన్ని పరిత్యజించి అవిశ్వాస స్థితిలో మరణిస్తే అప్పటివరకు చేసిన మంచి పనులన్నీ వృథా అవుతాయి. అటువంటివారు నరకంలో శాశ్వతంగా ఉంటారు(ఖురాన్ 2:217)... అల్లాహ్ వారిని క్షమించుగాక.
ఆ కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు..
అల్లాహ్ ఆగ్రహాన్నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండాలి. ఆయన అయిష్టతకు గురికాకుండా దైవభీతితో మసలుకోవాలి. మీ హక్కుల్ని అనుభవిస్తూ భార్యాబిడ్డలు, బంధువుల హక్కుల్ని కాపాడుతూ ఉండాలి. అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకుని ఉన్నాడని దివ్య ఖుర్‌ఆన్ గ్రంథంలోని అన్ నిసా ఆయత్ తెలుపుతోంది. విశ్వాసి మరొక విశ్వాసితో కలిసి ఒక కట్టడంలా రూపొందాలి. అలా ఏర్పడిన సత్సమాజం ప్రేమానురాగాలు కలిగిన పటిష్ఠ దేహంలా దృఢంగా ఉంటుంది. దౌర్జన్యాలు చేసేవారిని వారించాలి. ఒక ముస్లిముకు ఆపన్నమైన కష్టాన్ని దూరం చేస్తే ప్రళయదినాన ఎదురయ్యే కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు. బంధువులు కాకపోయినా ధనం లావాదేవీలు లేకున్నా అల్లాహ్ ధర్మమే ప్రాతిపదికగా అన్యోన్యంగా ఉన్నవారి వదనాలు జ్యోతిర్మయాలు. అద్భుతమైన ఈ వాక్యాల నందించిన పవిత్ర ఖురాన్ గ్రంథపారాయణం చేసిన సోదర సోదరీమణులు నేటి పరిస్థితుల్లో ఆలింగనం చేసుకోలేకున్నా సమయానికి తగిన ఆసరా ఇస్తే అల్లాహ్‌కు ప్రీతిపాత్రులవుతారు. మధురమైన సేమియా వంటకాలు ఇచ్చిపుచ్చుకోలేకున్నా బాధ్యతాయుతంగా మానవీయ పాత్రను పోషించగలగాలి. అప్పుడు ఎదుటివారినుంచి కృతజ్ఞతాభావంతో వెలువడే మాటలు మొహమ్మద్ ప్రవక్త(స.అ.వ.) సముఖానికి చేరేందుకు చూపే దివ్య బాటలు. వీడిపోయిన స్నేహితులు బంధువుల కోసం దుఆ చేస్తూ రాబోయే రంజాన్ ముబారక్ ప్రాప్తించాలని అపార కృపాశీలుడిని కోరుకుందాం. ఆమీన్!
ఇదీ చూడండి: భద్రతా సిబ్బందిని వైద్య సాయం కోరిన మావోయిస్టులు