అత్యంత క్లిష్టమైన బ్రహ్మవిద్య గురువు ద్వారా సులువుగా తెలుసుకోగలుగుతాం. గురువు సాధకుడి జీవితంలో భాగం. గురు ఆరాధన శ్రేష్ఠమైన దేవతారాధన కంటే గొప్పదని పురాణాలు కథలు కథలుగా చెబుతున్నాయి.
నేత్రాలు లేకపోయినా ఎలాగోలా బాధలు పడుతూ మనో నేత్రంతో బతకవచ్చు. జ్ఞానం లేకుండా బతకడం అసాధ్యం. ఆ జ్ఞానాన్ని శిరస్సుపై మోస్తున్న గురువు లేకుండా బతికే సంప్రదాయం మనలో లేదు. అందుకే ఎవ్వరూ ఏ పండగలూ చేసుకోని ఆషాఢ మాసంలో కూడా గురువును పూజించే పద్ధతిని ఏర్పరచారు పూర్వీకులు.
గురువును సేవించి ధన్యులైన శిష్యులు వినయశీలురై అపార జ్ఞానరాశిని పొందుతారు. తాను చెప్పింది చెప్పినట్లు ఆచరించి చూపించే శిష్యులకు ప్రసన్నుడవుతాడు గురువు. అటువంటి శిష్యుల కోసం దైవాన్ని సైతం శాసిస్తాడు.గులాబి పువ్వు దగ్గర పరిమళం ఉంటుంది. మల్లెపూల సమీపంలో ఉంటే అవి సువాసనలు వెదజల్లుతాయి. సంపెంగలు, పారిజాతాలు సరేసరి. గురువృక్షం నీడలో ప్రశాంతత పరచుకుని ఉంటుంది. గురువు కనిపించగానే ఇంద్రియాలు అదుపులోకి రావాలి. మనసు నిశ్చలం కావాలి. ఆత్మానందం అనుభూతిలోకి రావాలి.
మహా విష్ణువే స్వయంగా వేదవ్యాసుడై భక్తి కావ్యం భాగవతాన్ని రచించి లోకానికి విష్ణుభక్తిని ప్రబోధించాడని రుషులు, మునులు, జ్ఞానులు కీర్తించారు. యుగయుగాలుగా ఎవరు ఏది చెప్పినా, వ్యాసుడు చెప్పినదే మళ్ళీ చెప్పాలి. కొత్తగా చెప్పగలిగేది ఏదీ ఆయన మిగల్చలేదు. అటువంటి వ్యాసుణ్ని గురుపరంపరలో ఆది గురుమూర్తిగా మనసారా పూజించుకోవడానికి ఏర్పడినదే వ్యాసపూర్ణిమ.
ఒక వ్యక్తి జ్ఞానాన్వేషణలో గురువును వెదుకుతూ అడవిలో ఒక చెట్టు దగ్గర కూర్చున్న సాధువును చూశాడు. ఆయన దగ్గరకు వెళ్లి, ‘నాకొక గురువు కావాలి. ఏం చెయ్యాలి?’ అని అడిగాడు. ‘వెతుకు. వెతికితే దొరకనిదంటూ ఉండదు’ అని చెప్పాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి బయలుదేరి ప్రపంచమంతా వెతికి, చాలాకాలం తరవాత చివరికి, మళ్ళీ ఆ చెట్టు కింద సాధువు దగ్గరికే వచ్చాడు. నమస్కరించి ‘మీరే నా గురువు’ అన్నాడు.
‘ముప్ఫై సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు నీకు ఎరుక లేకపోవడం వల్ల నన్ను గుర్తు పట్టలేక పోయావు. ఇప్పుడు గుర్తుపట్టావు. నేనెప్పుడో నీ కోసం వచ్చి, తయారుగా ఉన్నాను. నీకు జ్ఞానం కలగడానికి ఇంత సమయం పట్టింది’ అన్నాడు గురువు. గురువును గుర్తించడంలోనే శిష్యుడి విజయం ఉంది. అప్పుడే ఆ వ్యక్తికి అసలైన గురుపూర్ణిమ ఉత్సవం మొదలవుతుంది.
- ఆనందసాయి స్వామి
- ఇదీ చదవండి : భావాలు కురిస్తే.. మనసులు తడిస్తే..