ప్రకృతి ఎంతో అందమైనది. రంగురంగుల పూల సోయగాలతో కనువిందు చేస్తుంటుంది. అద్భుతమైనది కూడా. చిత్ర విచిత్రమైన పుష్ప రూపాలతో చకితుల్ని చేస్తుంటుంది. అందులో భాగంగానే కొన్ని రకాల పువ్వులు కోతుల్నీ కీటకాల్నీ పక్షుల్నీ మనుషుల ముఖాల్నీ పోలి ఉంటాయి. అయితే అవి అలా పూయడం వెనక బలమైన కారణమే ఉంది అంటారు వృక్షశాస్త్ర నిపుణులు. అదే మిమిక్రీ. ఒక జీవిని మరో జీవి అనుకరించడం. సంతానోత్పత్తిలో భాగంగా పరాగ సంపర్కం కోసం కొన్ని రకాల పువ్వులు మకరందాన్ని అందించడంతోపాటు కీటకాల్నీ పక్షుల్నీ ఆకర్షించేందుకు ఇలా వింత రూపాలనూ ప్రదర్శిస్తుంటాయట. మిగిలిన జాతులతో పోలిస్తే చల్లని ప్రదేశాల్లో పెరిగే ఆర్కిడ్స్‌లోనే ఈ రకమైన పుష్పవిన్యాసం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ కుసుమాలన్నీ అలా విరిసినవే మరి!
కోతిపూలు!
అచ్చం కోతులూ కొండముచ్చుల ముఖాలతో పూసిన ఆర్కిడ్స్‌ని చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఎంత మిమిక్రీ అయినా అచ్చుగుద్దినట్లుగా కోతుల్ని తలపించడం చూస్తే ఇంతకుమించిన ప్రకృతి వింత ఉంటుందా అనిపించకమానదు. సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో చల్లని ప్రాంతాల్లో నీడలో పెరిగే డ్రాకులా జాతి ఆర్కిడ్లలో ఈ వింత రూపాలు కనిపిస్తాయి. ఈ మొక్కలు దక్షిణ అమెరికాలోని పెరూ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి.
ఉయ్యాల్లో పాపాయి!
ఉయ్యాల్లో వెచ్చని దుప్పటి కప్పుకున్న పాపాయిల్ని తలపిస్తున్నట్లే ఉంటాయి యాంగ్యులోవా యూనిఫ్లోరా ఆర్కిడ్లు. వీటినే స్వాడెల్డ్ బేబీ ఆర్కిడ్స్ అనీ అంటారు. ఆండెస్ పర్వతశ్రేణుల్లో కనిపించే ఈ రకంలో అనేక రంగులూ ఉన్నాయి. ఈ పూల రేకులు అచ్చం తులిప్‌లని పోలి ఉండటంతో వీటిని తులిప్ ఆర్కిడ్స్ అనీ పిలుస్తారు. ఇవి పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర రెండు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతాయి. విరిసిన పువ్వులు చాలాకాలం వాడిపోకుండా ఉండటంతో వీటిని కట్‌ఫ్లవర్స్‌లోనూ వాడుతుంటారు. అందుకే ఈ మొక్కల్ని గ్రీన్‌హౌసుల్లోనూ పెంచుతున్నారు.
నృత్యం చేసేస్తాయివి!
ఇంపేషన్స్ బెక్వార్టి మొక్క చాలా అరుదైనది. తూర్పు ఆఫ్రికాలోని వర్షారణ్యాల్లో మాత్రమే కనిపించే ఈ మొక్కనే డ్యాన్సింగ్ గర్ల్ ఇంపేషన్స్ అనీ అంటారు. తెలుపూ లేత గులాబీ రంగులో పుష్పించే ఈ పువ్వుని చూస్తే చిన్న పాప స్కర్టు వేసుకుని బెల్లారినా నృత్యం చేస్తున్నట్లే ఉంటుంది. ఆన్‌సీడియం మూన్‌షాడో... పూలు కూడా పొడవు గౌను వేసుకుని నృత్యం చేస్తున్న అమ్మాయిల్ని తలపిస్తుంటాయి.
రెమ్మరెమ్మకో చిలుక!
కొమ్మలమీద చిలుకలు వాలడం చూస్తుంటాం. కానీ రెమ్మరెమ్మకీ చిలుకలు పూయడం ఎక్కడైనా ఉంటుందా... కానీ ప్యారెట్ బల్సామ్ మొక్కని చూస్తే అచ్చం అలానే అనిపిస్తుంది. థాయ్‌లాండ్, బర్మా, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగే ఈ మొక్కనే ఫ్లయింగ్ కొకాటూ అనీ పిలుస్తారు. పూల పై రేకులు పొడవుగా ఉండటంతో వీటికా రూపం వస్తుంది.
తెలుపు రంగులో విరిసే హబెనారియా రేడియేటా పువ్వులు కూడా వైట్ ఎగ్‌రెట్ పక్షుల్ని గుర్తుతెస్తాయి. వీటినే ఫ్రింజ్‌డ్ ఆర్కిడ్ అనీ పిలుస్తారు. చైనా, జపాన్, కొరియా, రష్యా దేశాల్లో ఈ మొక్కలు ఎక్కువ. అలాగే ఎగిరే బాతుని తలపించేలా ఉన్న కాలియానా మైనర్ రకం ఆర్కిడ్ ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాల్లో కనిపిస్తుంది.
మ్యాగ్నోలియా కుటుంబానికి చెందిన లిలీఫ్లోరా పువ్వుల్ని విచ్చుకునే దశలో చూస్తే చిన్నసైజు పిట్టలు కొమ్మమీద కూర్చున్నట్లే ఉంటాయి. వసంతమాసంలో బీజింగ్ నగరాన్ని సందర్శిస్తే- లేత గులాబీరంగు పిట్టలతో కళకళలాడే ఈ చెట్లు కనువిందు చేస్తాయి. ఆ పూలు పూర్తిగా విచ్చుకున్నాక చెట్టంతా గులాబీరంగుతో గుబాళిస్తుంటుంది.
నవ్వింది తేనెటీగ!
ఓఫ్రిస్ బాంబ్లిఫ్లోరానే బంబుల్ బీ ఆర్కిడ్ అనీ, స్మైలీ బీ ఆర్కిడ్ అనీ పిలుస్తారు. నలుపూ ఎరుపూ ముదురు గోధుమ రంగుల్లో విరిసే ఈ పూలు మధ్యధరా ప్రాంతంలోని పోర్చుగల్, లెబనాన్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఓఫ్రిస్ జాతికే చెందిన ఇన్‌సెక్టిఫెరా అనే మరో రకం మొక్కకి పూసే పువ్వులయితే ఈగల్ని తలపిస్తాయి. స్కాండినేవియా, ఫిన్లాండ్, గ్రీసు, స్పెయిన్ దేశాల్లో ఈ మొక్కలు పెరుగుతాయి.
పూల ముఖాలు!
19వ శతాబ్దంలో ప్రేమకు సంకేతంగా భావించే పాన్సీ పూలల్లో వందల రకాలే కాదు, రంగులూ ఉన్నాయి. వీటిని ఎక్కువగా అందంకోసం పెంచుతుంటారు. అంతేకాదు, ఈ మొక్కల్ని సంప్రదాయ వైద్యంలో వాడతారు. పూలను ఫుడ్‌కలర్స్‌కీ ఉపయోగిస్తుంటారు. సువాసన వెదజల్లే ఈ పూలల్లో కొన్ని నవ్వుతున్నట్లు ఉంటే, మరికొన్ని కోపంగా ఉండే ముఖాల్ని పోలి ఉంటాయి.
భిక్షాం దేహీ!
కాల్సియోలారియా యూనిఫ్లోరానే హ్యాపీ అలియన్ అని పిలుస్తారు. కానీ చూడ్డానికి ఎవరో చిన్న గిన్నెను పట్టుకున్నట్లుగా ఉంటుంది. దీన్నే డార్విన్ స్లిప్పర్ ఫ్లవర్ అనీ అంటున్నారు. దక్షిణ అమెరికాలో ఉన్న టియెరా డెల్ ఫ్యూగో ప్రాంతంలోని కొండల్లో పసుపూ తెలుపూ గోధుమ రంగుల్లో విరబూసే వీటిని చూస్తే- వింత జీవులేవో భిక్షపాత్ర పట్టుకుని నడిచొస్తున్నట్లే అనిపిస్తుంది.
పువ్వు నోట్లో పులి!
తెల్లగా విరిసే ఆర్కిడ్ ఫింకా డ్రాక్యులా వాంపైరా ఆవు ముఖాన్ని పోలి ఉంటే, మూన్ ఆర్కిడ్ రకంలో అండాశయం, కేసరాలన్నీ కలిసి పులి ముఖాన్ని తలపిస్తాయి. అలాగే బటర్ ఫ్లై ఆర్కిడ్‌గా పిలిచే లెస్సర్ రకం పూలల్లో మధ్య రేకు అచ్చం ఏనుగు తొండాన్ని గుర్తుతెస్తుంది. ఇలా ఆర్కిడ్లని నిశితంగా పరిశీలించి చూస్తే మరెన్నో వింత రూపాలు కనిపించడం ఖాయం.
అందుకే అంటారంతా... పూలజాతుల్లో మిగిలినవన్నీ ఒకెత్తయితే, ఆర్కిడ్స్ ఒక్కటీ ఒకెత్తు. మందపాటి రేకలతో వాడిపోకుండా ఎక్కువకాలం తాజాగా ఉండటంతోపాటు చిత్రవిచిత్రమైన రూపాలతో అందరినీ ఆకర్షిస్తుంటాయివి. అందుకే చల్లని వాతావరణంలో మాత్రమే పెరిగే ఆర్కిడ్లని ఇప్పుడు అంతటా గ్రీన్‌హౌసుల్లో పెంచేందుకు కృషిచేస్తున్నారు. మనమూ ట్రై చేద్దామా!