ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం పట్టణానికి కేవలం 1 కి.మీ.దూరంలో ఉన్న అరసవల్లి-శ్రీ ఉషాపద్మినీ ఛాయాసమేత శ్రీ సూర్యనారాయణస్వామివారి దేవస్థానం దేశంలోని అతి ప్రసిద్ధ సూర్యదేవాలయాల్లో ఒకటి!
క్షేత్రచరిత్ర/ స్థల పురాణం: లోక కల్యాణార్థం దేవేంద్రుడు ఇక్కడ సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. రథసప్తమి పర్వదినం రోజున ఇక్కడ విశేష ఉత్సవం నిర్వహిస్తారు. కళింగ శిల్పశైలిలో ఉండే స్వామివారి ప్రధాన దేవాలయంలోని అయిదు ద్వారాల నుంచి ఏటా రెండుసార్లు(మార్చి 9 నుంచి 12 వరకు.., అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో ఉదయం) సూర్యకిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాన్ని స్పృశించడం గొప్ప విశేషం! ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు.
ఆదిత్యుని దర్శన సమయాలు: ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ ఉంటుంది. అనంతరం ఉదయం 5.30 గంటలకు నిత్యార్చన నిర్వహించి.. ఆ తర్వాత 6 గంటల నుంచి 12.30 గంటల వరకూ భక్తులందరికీ దర్శనానికి అనుమతిస్తారు.
మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య మహా నైవేద్యం.. దర్శనం ఉండదు. తిరిగి మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. 2 గంటల నుంచి 3.30 గంటల మధ్య స్వామివారికి పవళింపు సేవ. దర్శనానికి విరామం. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు.
ఇక్కడ భక్తులందరికీ స్వామివారి దర్శనం ఉచితం. కాస్త త్వరగా దర్శనం చేసుకోవాలనుకునేవారికి మాత్రం ఒక్కొక్కరికి రూ. 25 చొప్పున రుసుం వసూలు చేసి.. త్వరితంగా దర్శన అవకాశం కల్పిస్తారు.
ప్రత్యేకపూజలు: అష్టోత్తర శత నామార్చన, క్షీరాన్న భోగం, క్షీరాభిషేక సేవ, తిరువీధి సేవ, కల్యాణ సేవ, సూర్య నమస్వాక సేవ, శాశ్వత అన్నదానం.
రథసప్తమి పర్వదినం: ఈ రోజున రాష్ట్రం నలుమూలల నుంచే కాక.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. స్వామివారికి త్రిచ, సౌర, అరుణ ప్రయుక్తంగా సూర్య నమస్కార పూజలు, అష్టోత్తర శత సహస్ర నామార్చనలు నిర్వహిస్తారు.
ఏటా సంక్రాంతి రోజున క్షీరాభిషేకం, ఏకాదశి నాడు కల్యాణసేవ, ప్రతి ఆదివారం తిరువీధిసేవ నిర్వహిస్తారు. ఆయా సేవల్లో పాల్గొనదలిచిన భక్తులు నిర్దేశిత రుసుంకు అదనంగా రూ. 5 పోస్టేజి కలిపి ఆ మొత్తాన్ని ఎం.ఓ. లేదా డీడీ రూపంలో పంపించాలి. ఆ మేరకు ఆయా సేవలు చేయించి దేవస్థానం తిరిగి ప్రసాదం పంపిస్తారు. ఎం.ఓ కూపన్‌లో సరైన చిరునామా, గోత్రం వివరాలు రాయాలి.
ఆదిత్యుడికి జరిపే వివిధ పూజలు.. విశేష సేవల వివరాలు
అష్టోత్తర శతనామార్చన: రూ.20
క్షీరాన్న భోగం: రూ.50
క్షీరాభిషేక సేవ: రూ. 216
తిరువీధి సేవ: రూ. 500
కల్యాణ సేవ: రూ. 500
సూర్యనమస్కారాలు: రూ.50
అన్నదానం(పదిమందికి): రూ.150
కల్యాణాలు, క్షీరాభిషేకాలు: ప్రతినెలా ఏకాదశి పర్వదినాల్లో స్వామివారి ఉత్సవమూర్తులకు కల్యాణం నిర్వహిస్తారు. ప్రతినెలా వచ్చే మాస సంక్రమణం రోజున స్వామికి క్షీరాభిషేకం చేస్తారు.
సూర్యకిరణాలు: ప్రతి ఏడాది మార్చి 7, 8, 9, 10, అక్టోబరు 1, 2, 3, 4 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి.
సూర్యనమస్కారాలు: రోజూ రూ. 50 చెల్లిస్తే కుటుంబం పేరు మీద అర్చకులు సూర్యనమస్కారాల సేవ చేస్తారు.
రవాణా సౌకర్యం: కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారిపై ఉన్న నేపథ్యంలో రోడ్డుమార్గంలో శ్రీకాకుళానికి చేరడం చాలా సులభం. అలాగే శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ నుంచి 13కి.మీ.ల దూరంలో ఉన్నందున రైలు మార్గంలోనూ సులభంగానే అరసవల్లికి చేరుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం బస్‌స్టేషన్ నుంచి కేవలం 3 కి.మీ. దూరంలో అరసవెల్లి క్షేత్రం ఉంది. బస్టాండ్ నుంచి ప్రతి 10 నిమిషాలకూ ఒక బస్సు చొప్పున రవాణా సౌకర్యముంది. అలాగే శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ/ ప్రైవేటు బస్సులు.. క్యాబ్‌లు.. ఆటోల సౌకర్యముంది. 100 కి.మీల. దూరంలోని విశాఖపట్నం విమానాశ్రయం ద్వారా కూడా శ్రీకాకుళానికి చేరుకోవచ్చు.
శ్రీకాకుళం పట్టణం జిల్లాకేంద్రంగా ఉన్న నేపథ్యంలో.. చాలా ప్రభుత్వ.. ప్రైవేటు వసతిగృహాలు.. అద్దెగదులు అందుబాటులో ఉంటాయి. లేకుంటే విశాఖపట్నం నగరం నుంచి కేవలం 2 గంటల్లో వెళ్లొచ్చు కనుక అక్కడి నుంచైనా రాకపోకలు సాగించొచ్చు. వసతికి ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేదు.
వసతి.. ఇతర సౌకర్యాలకు సంబంధించి మరిన్ని వివరాలకు..
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్..
శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం, అరసవల్లి-శ్రీకాకుళం(జిల్లా)- 532 401, ఫోన్ : 08942 222421
వారిని లేదా.. శ్రీసూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.