మహబూబాబాద్ జిల్లా నర్సింహులు పేట మండలం గోపాతండా వద్ద ఆర్టీసీ బస్సుకు విద్యుత్ తీగలు తగలడం వల్ల ఆర్టీసీ మెకానిక్ మృతి చెందాడు. ఖమ్మం డిపోకు చెందిన మెకానిక్ శ్రీనివాసరావు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు.
ఖమ్మం నుంచి హన్మకొండకు బయలుదేరిన ఖమ్మం డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు గోపాతండావద్ద మరమ్మతుకు గురైంది. బస్సు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. ఖమ్మం డిపో నుంచి మెకానిక్ వచ్చి బస్సుకు మరమ్మతులు చేశారు. అనంతరం వాహనాన్ని వెనుకకు తీస్తుండగా 11కేవీ విద్యుత్ తీగలను తాకింది. విద్యుదాఘాతంతో బస్సు టైర్లు కాలిపోయాయి. కాలిన టైర్లను పరిశీలిస్తున్న క్రమంలో మెకానిక్ శ్రీనివాసరావు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సును నడుపుతున్న డ్రైవర్ చాకచక్యంగా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద స్థలాన్ని రీజనల్ మేనేజర్ సుగుణాకర్, ఖమ్మం డిపో మేనేజర్ శంకర్‌రావు పరిశీలించారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..