చిన్న నాటి నుంచి కలలు కన్న ఆర్మీ ఉద్యోగంలో చేరలేనని తెలిసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కల చెదిరి ఆ యువకుడు చెట్టుకి ఉరి వేసుకున్న దృశ్యాలు చూసి గ్రామస్థులు చలించిపోయారు.
ఎత్తు, మార్కులు లేవని..
నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు ఆర్మీలో ఉద్యోగం సాధించాలని చాలా కష్ట పడేవాడు. ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రభుత్వం ఈ మధ్యే నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు రోజుల క్రితం ఓ ప్రయివేటు కోచింగ్ సెంటర్‌కు ప్రవీణ్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. వారు ప్రవీణ్ ఎత్తు, విద్యాభ్యాసం వివరాలు అడిగారు. అయితే తనకు ఆర్మీలో చేరడానికి కావలసిన ఎత్తు, సరిపడా మార్కులు లేవని తెలిపారు. అప్పటివరకు కలలు కన్న అతనికి ఆర్మీ ఉద్యోగం రాదని భావించాడు.
రోజు లాగే వాకింగ్‌కి వెళ్లి..
రోజు లాగే ఈరోజు ఉదయం కూడా ప్రవీణ్ వాకింగ్‌కి వెళ్ళాడు. ఎంత సేపయినా.. అతడు ఇంటికి తిరిగి రాకపోవటంతో పంటకు నీరు పెడుతున్నాడనుకొని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ప్రవీణ్ తమ్ముడు పొలానికి వెళ్లి చూసినా అక్కడా లేకపోవటంతో కంగారు పడి చుట్టు పక్కల వెతికాడు. వారి చేను గట్టు పక్కనే ఉన్న చింతచెట్టుకు ఉరి వేసుకుని చనిపోయిన ప్రవీణ్ కనిపించాడు. భయాందోళనలకు గురైన తమ్ముడు కుటుంబ సభ్యులకు చెప్పాడు.
కన్నీరు పెట్టించిన దృశ్యాలు..
ఎలాగైనా ఆర్మీ ఉద్యోగంలో చేరి తమకు పేరు తీసుకొస్తాడనుకున్న కొడుకు విగతజీవిగా మారడం చూసి తలిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి తరలివచ్చారు. ప్రవీణ్ మృత దేహాన్ని చూసి అక్కడ ఉన్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చుడండి: డీసీఎం కిందకు దూసుకెళ్లిన స్కూటీ.. యువకుడు మృతి