సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో విషాదం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో పోలవేని నవీన్ బైపాస్ రహదారి సమీపంలోని మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
పోలవేని పోచయ్య విజయ దంపతులకు నవీన్ ఒక్కగానొక్క కుమారుడు. హుస్నాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్లో నివాసముంటున్న వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పోచయ్య 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా.. తల్లీ, కుమారుడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్న నాలుగు ఎకరాల్లో పత్తి పంట వేయగా పంట పూర్తిగా దెబ్బతిని పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేకపోయాడు. మనస్తాపానికి గురైన నవీన్ అర్ధరాత్రి సమయంలో హుస్నాబాద్ పట్టణంలోని బైపాస్ రహదారి సమీపంలో ఉన్న మామిడి తోటలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉన్న ఏకైక కుమారుడు మరణించడంతో తల్లి విజయ, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 13న హైదరాబాద్కు ఎండీఎంఏ డ్రగ్స్ కేసు నిందితుడు