కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం చింతకర్ర పరిధిలోని కిషన్ నాయక్ తండాలో విషాదం చోటుచేసుకుంది. చేను పని చేసుకుంటున్న ఓ మహిళ పిడుగుపాటుకు బలైంది. గ్రామానికి చెందిన లతిత తన అత్త, మామతో కలిసి వారి పత్తి చేనులో పని చేసుకుంటున్నారు. పనిలో నిమగ్నమైన సమయంలో వర్షం కురిసింది. కాసేపు కురిసిన వర్షం ఆగిపోయిన అనంతరం ఒక్కసారిగా పిడుగు పడింది.
ఈ ప్రమాదంలో లలితకు తీవ్రగాయాలు కాగా.. అత్తమామకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని ఎడ్లబండిలో హుటాహుటిన జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఉట్నార్ తరలించారు. అప్పటికే లలిత మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కిషన్ నాయక్ తండ నుంచి పట్టణాలకు సరైన దారి లేకపోవటం వల్ల లలితను సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయినట్లు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.