బిహార్‌కు చెందిన దినేష్‌కుమార్ సింగ్ (45) 14 ఏళ్ల కిందట విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. ఎనికేపాడులోని ఒక పాదరక్షల తయారీ సంస్థలో పనిచేసేవాడు. అతనికి భార్య చింతాసింగ్, కుమారులు సత్యం శివం, లక్ష దీప్ ఉన్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. పిల్లల మైనార్టీ తీరే వరకు తల్లి వద్దే ఉంచాలని కోర్టు సూచించింది.
దినేష్‌కుమార్ సింగ్‌కు ఒక సొంత ఇల్లు ఉంది. ఆ ఇంటిలో పై అంతస్తులో చింతాసింగ్, పిల్లలు, కింద అంతస్తులో దినేష్‌కుమార్ ఉండాలని కోర్టు పేర్కొంది. దీనితో రెండేళ్లుగా ఆ ఇంటిలో ఉంటున్నారు. చింతాసింగ్ రామవరప్పాడులోని అయ్యంగార్ బేకరిలో పనిచేస్తోంది. దినేష్ తన ఇంటి కింద అంతస్తులోనే చెప్పుల కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకొని, ఒక గదిలో నివాసం ఉంటున్నాడు. పిల్లల పోషణ ఆమె చూసుకుంటోంది. ఫీజులు మాత్రం దినేష్ చెల్లిస్తున్నాడు.
ఈ నెల 17న రాత్రి దినేష్ తన గదిలో నిద్రపోయాడు. 18వ తేదీ ఉదయం చింతా సింగ్ వేకువ జామున పనికి వెళ్లేందుకు నిద్రలేచి, పిల్లలు లోపల నిద్రపోతుండగా బయట గడియపెట్టి వెళ్లిపోయింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో దినేష్‌కుమార్ వద్ద పనిచేస్తున్న యువకుడు వచ్చి చూడగా, అతను విగతజీవిగా పడి ఉండడం చూసి భయంతో పారిపోయాడు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో నిద్రలేచిన పిల్లలు బయట నుంచి గడియపెట్టి ఉండటాన్ని గుర్తించి, పక్కన ఇంటి వారిని పిలవగా వారు వచ్చి తలుపు తీశారు. అనంతరం పిల్లలు.. తండ్రి వద్దకు వెళ్లగా అతను మంచంపై పడిపోయి ఉన్నాడు. అతని శరీరంపై గాయాలున్నాయి. తల్లికి సమాచారం అందించడంతో ఆమె ఇంటికి వచ్చి తనకు ఏమి తెలియదని పేర్కొంది.
స్థానిక వీఆర్వో ఈ నెల 18న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాపు చేపట్టారు. దినేష్‌కుమార్ భార్య చింతా సింగ్‌ను, చుట్టుపక్కల వారిని పటమట సీఐ రావి సురేష్‌రెడ్డి విచారించారు. దర్యాప్తులో చింతా సింగే హత్య చేసినట్లు తేలింది. ఆమెను ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా దినేష్ కొంత కాలంగా అడుగుతున్నాడు. ఆస్తి పోతుందనే భయంతో హత్య చేయాలని నిర్ణయించుకుంది. రాజ్‌కుమార్ సింగ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. అతనితో కలిసి ఈ నెల 17వ తేదీ రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న దినేష్ కుమార్ గొంతు నులిమి హత్యచేశారు. అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. గురువారం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: 'ప్రియుడితో కలిసి అమ్మే నాన్నను చంపేసింది'