హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. బాపుఘాట్ వద్ద ఉన్న ఓ మెడికల్ దుకాణంలోకి వెళ్లి డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా దగ్గు మందు ఇవ్వమని అడిగారు. దానికి మెడికల్ షాప్ యజమాని అభ్యంతరం తెలిపారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇవ్వడం కుదరదని చెప్పాడు.
దీంతో ఆగ్రహించిన తాగుబోతులు ఒక్కసారిగా మెడికల్ షాప్ లోపలికి ప్రవేశించి నానా హంగామా సృష్టించారు. మెడికల్ షాపు యజమానిపై దాడికి పాల్పడ్డారు. దాడి దృశ్యాలు సీసీ టీవీలో నిక్షిప్తమయ్యాయి. నిందితులు అడిగిన టానిక్ ఎక్కువ మోతాదులో సేవిస్తే నిద్రలోకి వెళతారని... అలవాటుపడి బానిసలు అవుతారని మెడికల్ షాపు యజమాని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.