భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం భూ నిర్వాసిత కుటుంబానికి చెందిన రూపిరెడ్డి సతీశ్ అనే యువకుడు.. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం రావాల్సిన ఉద్యోగం దక్కలేదనే మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పినపాక మండల సరిహద్దున ప్రభుత్వం 1080 మెగావాట్ల సామర్ధ్యంతో బీటీపీఎస్ నిర్మాణం చేపట్టింది. 2015-16లో అందుకోసం అవసరమైన వేల ఎకరాల భూమిని సేకరించింది. భూ నిర్వాసితుల్లో అర్హులకు బీటీపీఎస్లోనే శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. మండలంలోని సాంబయ్య గూడెంకు చెందిన రూపిరెడ్డి వెంకట్రెడ్డి అనే రైతు నుంచి ఇలాగే 1.2 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది.
భూ నిర్వాసితుడు వెంకట్రెడ్డి, కుమారుడు సతీశ్ 2015-16 సమయానికి కనీస అర్హత వయస్సుకు నెల రోజులు తక్కువగా ఉండటంతో.. అధికారులు అతడిని అనర్హుడిగా తేల్చారు. అనంతరం బాధితుడు తనకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలంటూ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఏ లాభం లేకపోయింది.
గతేడాది బీటెక్ పూర్తి చేసిన సతీశ్.. ప్రస్తుతం ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. తనకు రావాల్సిన ఉద్యోగం దక్కదేమోనన్న ఆందోళనతో.. తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. మంగళవారం నాడు అర్ధరాత్రి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రాణపాయస్థితిలోకి వెళ్లిన అతడిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ గురువారం కన్నుమూశాడు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి: ఉద్యోగం రాలేదని.. ఊరికే ఉండిపోలేదు..