ఉన్నతస్థాయి అధికారుల అవినీతిని ఈ ఏడాది పెద్ద ఎత్తున అవినీతి నిరోధకశాఖ అధికారులు బట్టబయలు చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా పదుల సంఖ్యలో అవినీతి అధికారులు పట్టుబడడం చర్చనీయాంశమైంది. ఈఎస్ఐ మందుల కుంభకోణం నుంచి... తాజాగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడిన కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ వరకు అన్నీ సంచలనం సృష్టించిన కేసులే. ప్రస్తుతం అనిశా అధికారులు గతంలో కంటే భిన్నంగా దాడులు నిర్వహిస్తున్నారు. లంచం తీసుకున్న అధికారులతోపాటు లంచం ఇచ్చిన వాళ్లను వదలడం లేదు. పక్కా ఆధారాలతో అక్రమార్కులు ఊచలు లెక్కపెట్టేలా చేస్తున్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ అడుగులు ముందుకేస్తున్నారు. ఫిర్యాదులు అందితే పక్కా ప్రణాళికతో... లంచం తీసుకుంటున్న అధికారులు ఏ స్థాయిలో ఉన్నా వారి అవినీతి డొంక కదుపుతున్నారు.
ఈ ఏడాది జనవరిలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ బల్వంతయ్య, ఎస్సై సుధీర్‌రెడ్డి మోసం కేసులో నిందితుడి నుంచి లక్షా 50వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. జూన్ నెలలో బంజారాహిల్స్‌లోని భూ వ్యవహారంలో లంచం తీసుకున్న షేక్‌పేట్ ఆర్ఐ, ఎమ్మార్వో సుజాతను పట్టుకుని 15 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా సుజాతను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఆగస్టులో అత్యధికంగా కోటీ పది లక్షల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు పట్టుబడడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఫిర్యాదుదారులు ఎవరూ లేకపోయినా సొంత సమాచార వ్యవస్థతో లంచం తీసుకుంటున్న సమయంలో దాడులు నిర్వహించి కోటి పది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుతోపాటు లంచం ఇచ్చిన అంజిరెడ్డి, శ్రీనాథ్‌తోపాటు వీఆర్ఏ సాయిరాజ్‌ను అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉండగా చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెప్టెంబరులో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ వ్యవహారంలోనూ అనిశా అధికారులు పకడ్బంధీగా వ్యవహరించి... నగేశ్‌తోపాటు ఆర్డీఓ అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్, నగేశ్ బినామీ జీవన్‌గౌడ్‌ను అరెస్టు చేశారు.
సెప్టెంబరులో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మల్కాజిగిరి ఎసీపీ నర్సింహ్మారెడ్డిని అనిశా అన్ని ఆధారాలతో పట్టుకుంది. అయనకు సంబంధించిన సుమారు 75 కోట్ల విలువైన ఆస్తులు కనుగొన్నారు. ఇదే వ్యవహారంలో ప్రభుత్వ భూమిని ఏసీపీ కబ్జా చేసినట్టు గుర్తించిన అధికారులు... మరో 8 మందిని అరెస్టు చేశారు. భూమి విషయంలో నర్సింహ్మారెడ్డి తెర వెనుక ఉండి తతంగం నడిపినట్టు అనిశా తేల్చింది. ఇదిలా ఉంటే రెండు సంవత్సరాలుగా ఈఎస్ఐ, ఏఎంఎస్ కుంభకోణంలో ఆ సంస్థ మాజీ సంచాలకురాలు దేవికారాణి భర్త గురుమూర్తి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా పెట్టిన 6కోట్ల రూపాయలను అనిశా గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ డిసెంబరులో అనిశాకు చిక్కాడు. అక్రమార్కులు ఎంతటివారైనా వదిలి పెట్టేది లేదని అధికారులు చెబుతున్నారు.