చెమటోడ్చి పంట పండించడమే వారికి తెలుసు.. కానీ ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కోవడం తెలియలేదు.. ఈసారి మంచిగా వర్షాలు పడుతున్నాయని అప్పుచేసి మరీ నేలతల్లిని నమ్మి పంటలు వేశారు. తీరా ఇలా జరుగుతుందని ఊహించలేక పోయారు. ప్రకృతి కోపాగ్నినికి అతిభారీ వర్షాలు కురిశాయి. దానితో చేతికందిన పంట నీటిపాలయ్యింది. ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఏం చేయాలో పాలుపోక మరణమే శరణ్యమనుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు యువరైతులు ఆత్మహత్య చేసుకుని వారి కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్(28) అదే గ్రామంలో 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. పెట్టుబడితో పాటు ఇంటి అవసరాల కోసం వేర్వేరు చోట్ల సుమారు రూ.2.50 లక్షల అప్పు చేశారు. పంట చేతికి వస్తే అప్పులు తీర్చుదామనుకున్నారు. భారీ వర్షాలతో పెట్టుబడి సైతం తిరిగివచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలోనని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సోమవారం రాత్రి పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు.
వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయని..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం పోలారం గ్రామానికి చెందిన ధరావత్ రాందాస్(39) 6 ఎకరాల్లో మొక్కజొన్న, 3 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇటీవలి వర్షాలకు వరి నేలమట్టమైంది. మొక్కజొన్న పంట మొలకలు వచ్చి దెబ్బతింది. మంగళవారం తన భార్య, కుమారుడితో కలిసి మొక్కజొన్న పంట కోతకు వెళ్లారు. పంటల సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మనస్తాపానికి గురయ్యారు. పొలం నుంచి ఇంటికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని లఖంపూర్‌కు చెందిన మడావి శంకర్(37) తండ్రి ఆరు నెలల కిందట మృతి చెందారు. తండ్రి పేరున ఉన్న వ్యవసాయ భూమిలో శంకర్ పత్తి వేశారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలతో పంట దెబ్బతినడంతో అప్పులు ఎలా చెల్లించాలని మనస్తాపానికి గురయ్యారు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన్ని బంధువులు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. శంకర్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇదీ చూడండి: బావిలోకి దూసుకెళ్లిన జీపు.. డ్రైవర్ మృతి, మరో ముగ్గురు గల్లంతు