నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ సమీపంలో కంటైనర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ.19 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్ల సంచులను సోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో గుట్కా పట్టుకున్న ఎస్సై అసిఫ్, పోలీస్ సిబ్బందిని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అభినందించారు. కడ్తాల్ గ్రామ సమీపంలోని సాగర్ కన్వెన్షన్ హాల్ వద్ద ఎస్సై అసిఫ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానంగా కనిపించిన కంటైనర్ వాహనాన్ని తనిఖీ చేసి.. 120 నిషేధిత గుట్కా ప్యాకెట్ సంచులను స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారించగా కర్ణాటక నుంచి ఆదిలాబాద్‌లోని షమ్ము అస్లాం ట్రేడర్స్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. పట్టుబడ్డ తంబాకు పొట్లాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కంటైనర్ వాహన యజమాని హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్, కర్ణాటకకు చెందిన వాహన డ్రైవర్లు గౌస్ షరీఫ్, జాకీర్లతో పాటు ఆదిలాబాద్‌కు చెందిన షమ్ము అస్లాం ట్రేడర్స్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో సోన్ సీఐ జీవన్ రెడ్డి, ఎస్సై అసిఫ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భారీ వర్షాల ఎఫెక్ట్: పాతబస్తీ ఆగమాగం