కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఓ ఇంట్లోకి దొంగలు దూరారు. ఇంటి యజమాని సదయ్య-సరస్వతి దంపతులు పని నిమిత్తం వేరే ఊరు వెళ్లారు. అదను చూసిన దొంగలు ఆదివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఇంటి తలుపుకున్న తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. నగదు, బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.
సోమవారం ఉదయం సదయ్య దంపతులు ఇంటికి చేరుకునే సమయానికి.. తాళం పగులగొట్టి ఉండటం చూసి ఆందోళనకు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని వస్తువులు చిందర వందరగా పడి ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐ సృజన్ రెడ్డిలు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
వేలి ముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. సదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుమారు ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు, నలభై తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
- ఇదీ చదవండి: మురికి కాలువలో 25 ఆవుల మృతదేహాలు- ఏమైంది?