జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మల గ్రామానికి చెందిన రాఘవేంద్ర, ఆంజనేయులు అనే ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు అధికంగా ఉండటం వల్ల.. ఇక్కడి నుంచి మద్యం సరఫరా చేసేందుకు అక్కడి వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు రూ.2 లక్షల మద్యంతో నది అవతలికి వెళ్లేందుకు పుట్టి ఉన్న రవికుమార్‌ను సంప్రదించారు. దీంతో ముగ్గురు కలిసి ఆదివారం అర్ధరాత్రి పుట్టి ద్వారా నది దాటుతుండగా.. ఒక్కసారిగా ప్రవాహం పెరిగి పుట్టి బోల్తా పడింది. రాఘవేంద్ర, ఆంజనేయులు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగా.. రవికుమార్ గల్లంతయ్యాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మత్స్యకారుల సాయంతో సోమవారం తుంగభద్ర నదిలో గాలించారు. రాత్రి వరకూ మృతదేహం లభ్యం కాకపోవడం వల్ల మత్స్యకారులు వలలు వదిలి వెళ్లారు. ఈరోజు ఉదయం మృతదేహం వలలకు చిక్కుకుని బయటపడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి : 'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'