ఆంధ్రప్రదేశ్‌లో పేకాట వ్యవహారంలో తనపై వైకాపా బహిష్కృత నేత సందీప్ చేసిన ఆరోపణలను తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఖండించారు. సందీప్ విడుదల చేసిన ఫోన్ ఆడియో తనది కాదని వివరణ ఇచ్చారు. తాడికొండ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి కోసం కొందరు వ్యక్తులు తనపై కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే సందీప్, సురేశ్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని స్పష్టం చేశారు. దీనిపై కక్షగట్టిన వారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
పథకం ప్రకారమే...
పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు బయటకు రాని ఆడియో, వీడియోలు ఇప్పుడు ఎందుకు వచ్చాయో చెప్పాలన్నారు. ఒక పథకం ప్రకారమే కొందరు వ్యక్తులు వారి వెనక ఉండి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఫేక్ ఆడియోలు, వీడియోలు విడుదల చేస్తూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయాలన్నింటినీ ఆ రాష్ట్ర సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని.. త్వరలోనే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. పార్టీని భ్రష్ఠు పట్టించే ఇలాంటి చర్యలను ఆపాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: 'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'