విశాఖపట్నంతో పాటు ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని కొందరు ఏజన్సీ ప్రాంతాల్లో భూములు లీజుకు తీసుకుని గంజాయి సాగు చేస్తున్నారు. కళాశాల స్థాయిలో విద్యార్థులకు సరదాగా మొదలైన అలవాటే వారిని బానిసలుగా మార్చేస్తోంది. ఎక్కువ లాభాలు ఉండటం వల్ల కొందరు విద్యార్థులు వ్యాపారులుగా అవతారమెత్తారు. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి కిలో రూ.1500లకు కొనుగోలు చేసి దానిని హైదరాబాద్ తరలించి కిలో రూ.5000 నుంచి రూ.6000 వరకు అమ్ముతున్నారు. ఇలా విక్రయాలకు పాల్పడుతున్న నాలుగు ముఠాలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.
తాజాగా ఈ నెల నాలుగున మాదన్నపేటలో అయిదుగురు విద్యార్థులను టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 42 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో నిందితుల నుంచి తీసుకున్న చరవాణిలోని నంబర్లను పరిశీలించగా ఎక్కువగా విద్యార్థులు ఉన్నట్లు తేలింది. ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారం చేస్తున్నట్లు బహిర్గతమైంది. పదుల సంఖ్యలో గంజాయి వ్యాపారులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేల్చిన ఎక్సైజ్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.