భాగ్యనగరంలో మళ్లీ ముఠా గొడవలు మొదలయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో క్రైం రేటు తగ్గినా... సడలింపుల తర్వాత వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ ఐదు రోజుల్లోనే ఆరు హత్యలు జరిగాయి. కుటుంబ కలహాలు, పాతకక్షలు తెరపైకి వచ్చి... అత్యంత కిరాతకంగా అంతమొందిస్తున్నారు. చిన్న చిన్న తగాదాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో వచ్చిన ఘర్షణలు... హత్యలకు దారితీస్తున్నాయి. ఈ నెల 1న ఎస్ఆర్నగర్ ఠాణా పరిధి వెంగళరావునగర్‌లో సంజీవ్... తన భార్యను కిరాతకంగా పొడిచి చంపేశాడు. కుటుంబ కలహాల కారణంగా భార్య రాణిని హత్యచేసి పరారయ్యాడు.
నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన గాంధీనగర్ బన్సీలాల్‌పేటకు చెందిన కృష్ణ... దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కృష్ణ... అదే ప్రాంతంలో రైలు పట్టాల పక్కన శవమై తేలాడు. హత్య చేసిన తర్వాత గుర్తపట్టకుండా శవాన్ని చెత్తా చెదారంతో కాల్చి వేశారు. స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో క్లీనింగ్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు.
ఒక్కరోజే నాలుగు హత్యలు
ఇదిలా ఉండగా... శుక్రవారం ఒక్కరోజే నాలుగు హత్యలు జరిగాయి. గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో మజర్ అనే వ్యక్తి మద్యం మత్తులో అతని స్నేహితుడు రాహుల్‌ను హతమార్చాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన అనంతరం... ఏదో విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో మజర్ తన స్నేహితుడు రాహుల్ తలపై బండరాయితో మోది హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పాతబస్తీ రీన్‌బజార్ పరిధిలోని జాఫర్ రోడ్డులో యువకుడిని వెంటాడి మరీ... దారుణంగా హత్య చేశారు. కుటుంబ కలహాల కారణంగా కొద్ది రోజులగా ఇంటి దగ్గర రెక్కి నిర్వహించి అనంతరం హత్య చేశారని మృతుడి సోదరుడు తెలిపాడు.
లంగర్‌హౌస్‌లో జంట హత్యలు
తాజాగా లంగర్‌హౌస్ పరిధిలో జంటహత్యలు స్థానికులను మరింత భయాందోళనకు గురిచేశాయి. గోల్కొండకి చెందిన చాంది మహ్మద్, ఫయాజుద్దీన్‌లు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా... వెనకనుంచి వారిని కారుతో ఢీకొట్టారు. కిందపడ్డ తర్వాత కారులోంచి దిగిన ముగ్గురు వ్యక్తులు... వారిపై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో మహ్మద్, ఫయాజుద్దీన్‌లు ఇద్దరూ మృతిచెందారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం.!