హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో వేర్వేరు చోట్ల రెండు బాల్య వివాహాలను షీ బృందాలు అడ్డుకున్నాయి. జవహర్‌నగర్ ఠాణా పరిధిలోని బాలాజీనగర్‌లో ఉండే ఓ 17 ఏళ్ల బాలికకు స్థానిక యువకుడి(21)కి ఆగస్టు 5న యాదగిరిగుట్టలో పెళ్లి చేయడానికి నిశ్చయించారు. కుషాయిగూడ డివిజన్ షీ బృందం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలల సహాయ కేంద్రం అధికారుల సహకారంతో ఇరు కుటుంబాల పెద్దల వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లి రద్దు చేశారు.
మరో ఘటనలో కుషాయిగుడ ఠాణా పరిధిలోని నాగారంలో 16 ఏళ్ల బాలికకు తల్లిదండ్రులు లేరు. మేనత్త, మేనమామల వద్ద ఉంటోంది. జవహర్‌నగర్‌లో ఉండే యువకుడి(26)కి ఆ బాలికను ఇచ్చి స్థానిక పెద్దమ్మ గుడి వద్ద పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. షీ బృందం వారి పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చింది. పెళ్లిని రద్దు చేయించింది.
బాధ్యులందరూ జైలుకే: సీపీ మహేష్ భగవత్
అమ్మాయి వయసు 18, అబ్బాయి వయసు 21 నిండకుండా ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా శిక్ష పడుతుందని జైలు పాలవుతారని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ హెచ్చరించారు. బాల్య వివాహాల్లో పాల్గొనే పురోహితులు, పెళ్లి పెద్దలు, మధ్యవర్తులు, పెళ్లి పత్రికలు ముద్రించేవారు, హాజరైనవారు శిక్షకు గురవుతారన్నారు. బాల్య వివాహాలపై 100 లేదా 9490617111 నంబరులో ఫిర్యాదు చేయాలన్నారు.