రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు ఆటోలో తరలిస్తున్న 7గురు నిందితులను మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దుండిగల్ పీఎస్ పరిధిలో ఈ నెల 15వ తేదీ రాత్రి రేషన్ బియ్యాన్ని ఆటోలో అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న తాండూర్‌కు చెందిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ నరసింహరావు తెలిపారు. నిందితులు ఇక్భాల్, అఫ్సర్, ఫయాజ్, నయూం, తోసిఫ్, ఆసిఫ్, జబ్బార్‌లుగా గుర్తించారు.
కుత్బుల్లాపూర్‌లోని రొడామేస్త్రి నగర్, శాపూర్నగర్కు చెందిన మరో 8 మంది తాము పోలీస్ ఇన్ఫార్మర్స్, రిపోర్టర్స్ అని చెప్పుకుని ఈ ఏడుగురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని ఏసీపీ తెలిపారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. వారు అజార్, ఖయ్యూం, సలీం, ఫర్వేజ్, అజ్మత్ అలీ, నవీన్, శ్రీకాంత్, సమీర్‌లుగా గుర్తించారు.
ఈ ఎనిమిది మంది రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆ 7గురు నిందితులను కైసర్ నగర్ వద్ద ఆపి.. రూ.2లక్షలు ఇవ్వాలని లేదంటే పోలీసులకు పట్టిస్తామని బెదిరించారు. నిందితులు డబ్బులు ఇస్తామని చెప్పి అజ్మత్ అలీ అనే వ్యక్తిని కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. ఎంతకూ అజ్మత్ అలీ తిరిగి రాకపోవడం వల్ల మిగిలిన వారు దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు అజ్మత్ అలీ ఫోన్ సిగ్నల్ ఆధారంగా 7గురు నిందితులు తాండూరులో ఉన్నట్లు దుండిగల్ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి ఇన్నోవా కారు, 3 చరవాణులను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు.
ఇవీ చూడండి: పోలీసులే లక్ష్యంగా మందుపాతర.. వెలికితీసిన బాంబ్‌స్క్వాడ్