రాజకీయ కుట్రలో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్పంచ్ మాసు రాజయ్య మృతి చెందాడని ఆరోపిస్తూ.... బంధువులు ఆందోళన చేపట్టారు. రాజయ్య కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి తిరుమలపై చర్య తీసుకోవాలని... ఉపసర్పంచ్ పూర్ణచంద్రరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజయ్య కుటుంబంలోనే ఒకరికి సర్పంచ్ పదవి ఇవ్వాలని కోరారు.
జడ్పీటీసీ గొర్రె సాగర్, టేకుమట్ల జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి తదితరులు ఉప సర్పంచ్ పూర్ణచంద్రరావు ఇంటికి వెళ్లి మాట్లాడగా... రాజీనామాకు నిరాకరించినట్లు తెలిసింది. కోపోద్రిక్తులైన కొంత మంది యువకులు పూర్ణచంద్ర ఇంటిపై రాళ్లు రువ్వగా... ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.