భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతూ అడ్డొచ్చిన వారిని బెదిరిస్తున్నారు. అంతే కాదు భౌతిక దాడికి దిగుతున్నారు. బూర్గంపాడు మండల కేంద్రంలో ప్రభుత్వం అనుమతులతో ఇటీవల ఇసుక తవ్వుతున్నారు. పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వారికి అడ్డుకట్ట వేయాలని జడ్పీటీసీ కామారెడ్డి శ్రీలత పలు ప్రయత్నాలు చేశారు.
మంగళవారం అర్ధరాత్రి జడ్పీటీసీ ఇంటికి వెళ్లి శ్రీలత, ఆమె భర్తపై దుండగులు దాడికి యత్నించారు. జడ్పీటీసీ దంపతులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోంపల్లి, ఉప్పుసాక, సారపాక, బూర్గంపాడు కేంద్రాలుగా చేసుకుని అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని జడ్పీటీసీ ఆరోపించారు. అధికార పార్టీలో ఉన్నా ఇసుక మాఫియాను ఏమి చేయలేరని ఈ ఘటన నిరూపించిందన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: దుబ్బాకలో ఓటమిపై తెరాస కార్యకర్త ఆత్మహత్య!