నిత్యం ప్రయాణికుల రాకపోకలతో కిటకిటలాడే నిర్మల్ ప్రయాణ ప్రాంగణంలో దొంగతనం జరిగింది. రిజర్వేషన్ ఇన్ఛార్జ్ టీవీ రమణ తెలిపిన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రిజర్వేషన్ కేంద్రం తలుపు తాళం పగలగొట్టి లోపలకు ప్రవేశించాడు. అక్కడ డ్రాలో ఉన్న బస్సుపాస్ జారీకి సంబంధించిన రూ. 2,880 నగదును అపహరించాడు.
గది పక్కనే ఏర్పాటు చేసిన సాయిబాబా చిత్రపటం వద్ద ఉన్న హుండీని సైతం తెరిచి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లాడు. బస్‌స్టాండ్‌లో దొంగతనం జరగడం వల్ల సిబ్బందితో పాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రమణ తెలిపారు. పట్టణ సీఐ శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణ ప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: 'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'