సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడకు చెందిన స్థిరాస్తి వ్యాపారి గుర్రం శశిధర్‌రెడ్డి(47) దారుణహత్యకు గురయ్యారు. శశిధర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం రోజు మాదిరిగా గ్రామానికి సమీపంలోని తన వ్యవసాయక్షేత్రానికి వెళ్లారు. అక్కడే కాసేపు శశిధర్‌రెడ్డి తన చరవాణిలో మాట్లాడుతూ కారును మళ్లించి పెట్టమని డ్రైవర్‌కు చెప్పారు. పావుగంట వ్యవధిలో గుర్తు తెలియని ఆటోలో సుమారు ఆరుగురు దుండగులు ఒకేసారి దూసుకొచ్చి శశిధర్‌రెడ్డిని వెంటాడారు. వ్యవసాయ క్షేత్రంలో పరుగులు పెట్టిన అతడిని వేటకొడవళ్లు, కత్తులతో నరికారు.
చివరకు పక్కనే ఉన్న వరిపొలంలో తల కనిపించకుండా తొక్కి హతమార్చారు. హత్య సమయంలో శశిధర్‌రెడ్డి అరుస్తుండగా తాను అక్కడి నుంచి పారిపోయి.. సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్ తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కత్తులు, కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మోహన్‌కుమార్, సీఐ విఠల్‌రెడ్డితో సహా క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలు అక్కడకు చేరుకొని విచారణ జరుపుతున్నాయి. శశిధర్‌రెడ్డి రెండో భార్య భవానీ ఇటీవల కూతురుకు జన్మనిచ్చింది. మృతదేహాన్ని సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ‘సలార్’ చిత్ర యూనిట్ వ్యాన్‌ను ఢీకొన్న లారీ