వికారాబాద్ జిల్లా కేంద్రలో ఇద్దరు కామాంధులు దారుణానికి యత్నించారు. మద్యం మత్తులో ఇంటిబయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారయత్నం చేశారు. పట్టణంలోని ఇండోర్నగర్లోని హమ్మలి బస్తిలో అద్దెకు ఉంటున్న ఇద్దరు వ్యక్తులు పూటుగా మద్యం సేవించారు. మత్తులో తూగుతూ వెళ్తున్న ఇద్దరికి... ఓ ఇంటి ముందు ఆరేళ్ల చిన్నారి ఆడుకుంటూ కనిపించింది.
మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తుల్లోని కీచక బుద్ధి మేల్కొంది. వెంటనే ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంటి తలుపులు మూసేసి... బాలికపై అత్యాచారానికి ప్రయత్నించారు. బాలిక అరుపులు విని... ఇరుగుపొరుగువారు అప్రమత్తమై ఇంటి వద్దకు వెళ్లారు. తలుపులు పగలగొట్టి... ఇద్దరినీ బయటకు ఈడ్చుకొచ్చారు. కోపోద్రిక్తులైన స్థానికులు ఇద్దరు కామాంధులకు దేహశుద్ధి చేసి... అక్కడే ఓ స్తంభానికి కట్టేశారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.