మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం శివారులో రూ.25 లక్షలు విలువ చేసే 252 కేజీల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారు, రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వాహనాలను సీజ్ చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు.
ములుగు జిల్లా పందికుంట గ్రామానికి చెందిన చెక్క కుమారస్వామి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రాళ్లవాగు దస్రు తండాకు చెందిన బోడ సుమన్, భూక్యా రాము, భూక్యా రమేశ్‌లు ఒక ముఠాగా ఏర్పడినట్లు గుర్తించారు. ఈ నలుగురు ఇప్పటికే పలు కేసుల్లో నిందితులని వెల్లడించారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం ఇదే తొలిసారని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు కృషిచేసిన సిబ్బందికి ఎస్పీ రివార్డులను అందించి అభినందించారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ నరేష్ కుమార్, ఎస్సై సతీశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రూ.30 కోసం బావ హత్య.. హంతకుడికి జీవితఖైదు