వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండలం గేటుపల్లికి చెందిన దుర్యత్ సింగ్ వరంగల్లో ట్రాఫిక్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య జ్యోతి నెక్కొండ మండల కేంద్రంలో టైలరింగ్ షాపు నిర్వహిస్తుంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఈ క్రమంలో ఇదే మండలం అప్పల్రావుపేటకు చెందిన జిల్ల రాజుతో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడం వల్ల ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవని, ఈక్రమంలో దుర్యత్ సింగ్ కనపడకపోవడం వల్ల కుటుంబం సభ్యులు మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచారణ చేపట్టిన గంటల్లోనే దుర్యత్ సింగ్ను హతమార్చినట్లు తేల్చారు.
విషయం కుటుంబ సభ్యులకు తెలియడం వల్ల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు దుర్యత్ సింగ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి శాంతింప చేశారు. దుర్యత్ సింగ్ను అతని భార్య ఉద్దేశ్య పూర్వకంగానే హత్యచేసినట్లు పోలీసులు వెల్లడించారు. మంగళవారం కేసును ఛేదించినట్లు తెలిపారు. జ్యోతి, రాజు ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇల్లాలి దుర్బుద్ధి కారణంగా తండ్రి హత్యకు గురికాగా.. తల్లి జైలు పాలు కావడంతో చివరకు ఇద్దరు పిల్లల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది.
ఇవీ చూడండి: వివాహేతర బంధానికి బలైన హోంగార్డ్