హైదరాబాద్ నార్సింగి సమీపంలోని మెక్నంపూర్కు చెందిన ముక్తార్ బేగం.. రెండేళ్ల కూతురుతో కలిసి భిక్షాటన చేస్తూ.. జీవనం సాగిస్తోంది. ఈ నెల 9న మసబ్ట్యాంకులోని ఓ బ్యాంకు వద్ద పడుకుంది. అర్ధరాత్రి ఒంటి గంటకు.. ఓ వ్యక్తి ఆమె కూతురు మహీన్ను అపహరించే ప్రయత్నం చేయగా నిలువరించింది.
కాసేపటికి నిద్రలోకి జూరుకున్న తర్వాత మరో వ్యక్తి బాలికను అపహరించి ఆటోలో తీసుకెళ్లాడు. మరుసటి రోజు ముక్తార్ బేగం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటో డ్రైవర్‌ను గుర్తించిన పోలీసులు.. నిందితుల వివరాలు సేకరించి అరెస్టు చేశారు. నిందితులు బజార్‌ఘాట్‌కు చెందిన సయ్యద్ షఫీ, మహమ్మద్ ఆఫిజ్గా గుర్తించారు.