తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గత నెల 13న హైదరాబాద్ మియాపూర్‌లోని రిలయన్స్ డిజిటల్ మాల్లో దొంగతనం జరిగింది. షాపులోని 30 లక్షల విలువైన 119 సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయని పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఐదుగురు వ్యక్తులు దుకాణం షట్టర్లు పగులగొట్టి సెల్ఫోన్లు దొంగతనం చేసినట్లు గుర్తించారు. మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో గాలించారు. ముంబయి పోలీసుల సహకారంతో ఓ ఇంట్లో ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్ తర్వాత పటాన్‌చెరులోని ఓ మద్యం షాపులోనూ దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాన నిందితుడు మహ్మద్ తారీఫ్ దావుద్తోపాటు మరో నలుగురు ఫరాన్, రషీద్, మహ్మద్ సుఫియన్, రాజులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 30 లక్షల విలువైన 113 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఓ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన తారీఫ్‌కు అక్కడే.. రాజు అనే మరో నేరస్థుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ జైలు నుంచి విడుదల అయ్యాక మరో ముగ్గురితో కలిసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా దుకాణదారులు వాచ్‌మెన్‌ను నియమించుకోవడంతోపాటు.. తమ షాపుల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు.