రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. హుటాహుటిన అదనపు బలగాలను పంపి, గాలింపు ముమ్మరం చేసింది. రాష్ట్రంలోకి చొరబాట్లకు అవకాశం లేకుండా చూడటంతోపాటు అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు మండలంలో దాదాపు 200 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు కలిసి ఇటీవల కొన్ని విధ్వంస కార్యక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం, అర్ధరాత్రి చింతూరు మండలంలో రహదారి నిర్మాణ వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు, చెట్లు నరికి రోడ్లకు అడ్డంగా పడేశారు. ఈ ఘటనలు చిన్నవే అయినప్పటికీ, ఒకేసారి దాదాపు 200 మంది పాల్గొనడాన్ని పోలీసు యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది.
చొరబడే అవకాశం ఉంది
ఇంతమంది మావోయిస్టులు, సానుభూతిపరులు బహిరంగంగా సంచరించిన ఉదంతాలు ఈ మధ్య కాలంలో లేవు. రాష్ట్ర విభజనకు ముందు చింతూరు మండలం ఖమ్మం జిల్లాలోనే ఉండేది. విభజన తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. అలానే మావోయిస్టులు పార్టీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి జిల్లాలతో ప్రత్యేక డివిజన్ కమిటీ ఏర్పాటు చేశారు. కొయ్యాడ సాంబయ్య అలియాస్ గోపన్న అలియాస్ ఆజాద్ దీనికి కార్యదర్శిగా ఉన్నారు. చింతూరులో విధ్వంసం ఈ కమిటీ ఆధ్వర్యంలోనే జరిగి ఉండే పక్షంలో తెలంగాణలోకి కూడా వీరు చొరబడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రాజెక్టుల వద్ద భద్రత
చింతూరు మండలంలో ఘటనల గురించి తెలియగానే భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్ తదితర జిల్లాల ఎస్పీలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. అవసరమైన జిల్లాలకు అదనపు బలగాలను పంపుతున్నారు. చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు, గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణ పనులకు మావోయిస్టులు ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్