ఏటీఎం కేంద్రాల్లో సాంకేతిక లోపం సృష్టించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రమోద్, రాజస్థాన్‌కు చెందిన సంతోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నాంపల్లి పీఎస్ పరిధిలోని బజార్ ఘాట్ ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో గత నెల 10, 11, 12 తేదీల్లో నగదు లావాదేవీల్లో తేడా వచ్చినట్లు బ్యాంక్ మేనేజర్ గుర్తించారు.
సదరు బ్యాంక్ మేనేజర్ దినేష్ ఫిర్యాదుతో పోలీసులు నిందితులు మోసం చేసే తీరును గుర్తించారు. ముఠా సభ్యులు ఏటీఎం కేంద్రానికి వెళ్లి నగదు డ్రా చేస్తారు. నగదు బయటికి వచ్చే సమయంలో ఏటీఎం యంత్రాన్ని స్విచ్ ఆఫ్ చేయడం లేదా విద్యుత్ సరఫరా నిలిపి వేయడం లాంటి పనులు చేస్తారు. దీనివల్ల నగదు బయటికి వచ్చినప్పటికీ లావాదేవి నిలిచిపోయినట్లు చూపిస్తుంది. ఖాతాల్లో నుంచి నగదు డెబిట్ అవుతుంది. ముఠా సభ్యులు మరుసటి రోజు బ్యాంకుకి వెళ్లి ఏటీఎం కేంద్రంలో లోపం వల్ల నగదు తీసుకోలేకపోయామని ఫిర్యాదు చేస్తారు.
దీంతో బ్యాంకు యజమానులు వారి వారి ఖాతాల్లో తిరిగి నగదు జమ చేస్తున్నారు. ఇలా బాజార్ ఘాట్ ఏటీఎం కేంద్రం నుంచి లక్షా పదివేల రూపాయల తేడా వచ్చినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు నిఘా పెట్టి ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!