కస్టమర్ కేర్ మోసాలు.. మనం తరచుగా వినే సైబర్ నేరాల్లో ఇవే ఎక్కువ. ఏదైనా కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో వెతికినప్పుడు అక్కడ కనిపించిన నంబర్‌కి ఫోన్ చేస్తాం. కొన్నిసార్లు అవీ నకిలీ నంబర్లయితే అవతలి వ్యక్తులు చెప్పే మాయ మాటలు నిజమని నమ్మి వాళ్లు చెప్పినట్లు చేసి మోసపోతుంటాం. ఒక వేళ మీరు నకిలీ కస్టమర్ కేర్ నంబర్లకి ఫోన్ చేసినా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని యాప్స్ మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకోకూడదు. ఎందుకంటే.. మీకు సహాయం చేస్తున్నామనే పేరుతో కొన్ని రిమోట్ యాక్సెట్ యాప్‌లను మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేయిస్తారు. తర్వాత మీ బ్యాంక్ ఖాతాలను పూర్తిగా ఖాళీ చేసేస్తారు. మరి ఆ యాప్స్ ఏంటో.. వాటితో ఎలాంటి ప్రమాదం పొంచి ఉందనేది ఒక్కసారి చూద్దాం..
టీం వ్యూయర్ క్విక్ సపోర్ట్ (TeamViewer QuickSupport)
![TeamViewer QuickSupport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10248720_1_pms.jpg)
ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ యాప్‌ను ఉపయోగిస్తుంటారు. దీని సహాయంతో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల ఫోన్‌లు, కంప్యూటర్లను మరో చోటు నుంచి రిమోట్ యాక్సెస్ చేసి ఆపరేట్ చెయ్యొచ్చు. ఈ యాప్ ఉపయోగకరమైందే అయినప్పటికీ దీన్ని డౌన్‌లోడ్ చేసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. వినియోగదారుల నుంచి బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించేందుకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిసింది.
రిమోట్ డెస్క్‌టాప్ (Remote Desktop)
![Remote Desktop](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10248720_2_pms.jpg)
టీం వ్యూయర్ తరహాలోనే పనిచేసే మరో యాప్ రిమోట్ డెస్క్‌టాప్. మైక్రోసాఫ్ట్ కంపెనీ అందిస్తున్న ఈ యాప్‌తో కంప్యూటర్, వర్చువల్ యాప్స్‌ని కంట్రోల్ చెయ్యొచ్చు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఉపయోగించే యాప్‌లతో ఇది కూడా ఒకటి. ఈ యాప్ ద్వారా హ్యాకర్స్ వేరొకరి కంప్యూటర్ యాక్సెస్ చేసినా బాధితులు నేరాన్ని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు దొరకవు.
ఎనీ డెస్క్ రిమోట్ కంట్రోల్ (AnyDesk Remote Control)
![AnyDesk Remote Control](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10248720_3_pms.jpg)
ఈ యాప్‌ను ఎక్కువగా వాణిజ్యపరమైన లావాదేవీల కోసం కంప్యూటర్లు రిమోట్ యాక్సెస్ చేసేవారు ఉపయోగిస్తుంటారు. హ్యాకర్స్ కూడా ఎక్కువగా బాధితుల్ని ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతుంటారు. అలా మిమ్మల్ని ఎవరైనా అపరిచితులు ఈ యాప్ డౌన్‌లోడ్ చేయమని కోరితే వాటికి దూరంగా ఉండండి.
ఎయిర్ డ్రాయిడ్ & ఎయిర్ మిర్రర్ (AirDroid & AirMirror)
![AirDroid and AirMirror](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10248720_4_pms.jpg)
ఈ యాప్‌లు ఎలా పనిచేస్తాయో తెలియకపోతే వీటి జోలికి వెళ్లపోవడమే మేలంటున్నారు సైబర్ నిపుణులు. ఇవి మీ మొబైల్‌లో ఉంటే కంప్యూటర్ సహాయంతో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చెయ్యొచ్చంటున్నారు. ఒక వేళ ఈ యాప్‌లు డౌన్‌లోడ్ చేయమని మీ తెలిసిన వారు సూచించినా వాటి పనితీరు గురించి తెలియనప్పుడు డౌన్‌లోడ్ చెయ్యొద్దు.
క్రోమ్ రిమోట్ డెస్క్‌టాప్ (Chrome Remote Desktop)
![Chrome Remote Desktop](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10248720_5_pms.jpg)
గూగుల్ అందిస్తున్న రిమోట్ యాక్సెస్ యాప్. ఇది ఎంతో ఉపయోగకరమైన యాప్ అయినప్పటికీ, సైబర్ నేరగాళ్లు దీని ద్వారా యూజర్స్ ఓటీపీలను తెలుసుకుని వారి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేస్తారు.
స్ల్పాష్‌టాప్ పర్సనల్ (Splashtop Personal)
![Splashtop Personal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10248720_6_pms.jpg)
కస్టమర్ కేర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే మీరు డౌన్‌లోడ్ చేయకుండా ఉండాల్సిన మరో యాప్ స్ల్పాష్‌టాప్ పర్సనల్. దీని ద్వారా హ్యాకర్స్ ఇతరుల కంప్యూటర్/మొబైల్ యాక్సెస్ చేసి మోసాలకు పాల్పడుతుంటారు. అందుకు వీటి వినియోగం తెలియకపోతే దూరంగా ఉండటం మేలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.
ఇదీ చదవండి : ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌తో వెబ్సైట్ సంస్థ మోసం