జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రాథమిక వైద్యశాల మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని రాగం కొమురయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందాడు.
గ్రామానికి చెందిన కొమురయ్య గొర్రెలను పాకలో తోలి నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా.. ప్రాథమిక వైద్యశాల మూలమలువు వద్ద వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం వేగంగా కొమురయ్యను ఢీకొట్టింది. ప్రమాదంలో కొమురయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గుర్తించిన స్థానికులు బాధితుడిని ప్రథమ చికిత్స కోసం తాడిచెర్ల వైద్యశాలకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
బైకు నడుపుతున్న వ్యక్తి నిర్లక్ష్యం కారణంగానే కొమురయ్య మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: దారుణం: చెరువులో ఆడశిశువు మృతదేహం