ఏపీలోని గుంటూరు చంద్రయ్యనగర్లో నివాసం ఉంటున్న ఓ మహిళకు వివాహమై ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఆమె భర్త 5 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత ఆమె తన అక్క వద్ద ఉంటూ మిషన్ కుడుతూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఓ దర్జీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. నెలలు నిండిన ఆమె ఈ నెల 11న గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది.
ఈనెల 19న సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రిలో ఆమెకు సత్యవతి అనే మధ్యవర్తి పరిచయమైంది. జీజీహెచ్లో పనిచేస్తున్న హెడ్ నర్స్ నారాయణమ్మకు పిల్లలు లేరు. ఆమెకు పాపను ఇస్తే రూ.75 వేలు ఇప్పిస్తామని మధ్యవర్తి చెప్పింది. హెడ్ నర్స్ నారాయణమ్మ దగ్గర ఆ మధ్యవర్తి లక్ష రూపాయలు తీసుకుంది. బాలింత తల్లికి రూ.75 వేలు ఇచ్చి, తాను రూ.25 వేలు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 19వ తేదీన గుంటూరులోని అమరావతి రోడ్డులో నగదు ఇచ్చి పాపను తీసుకున్నారు. విషయం వార్డు వాలంటీర్ల ద్వారా చైల్డ్ లైన్ అధికారులకు తెలిసింది.
ఈ విషయంపై చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు స్థానిక అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అరండల్పేట పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న దర్జీ పరారీలో ఉన్నారు. బాధ్యతాయుతమైన నర్స్ ఉద్యోగం చేస్తూ ఆమె పాపను కొనుగోలు చేయటం సరికాదని సీఐ రమణకుమార్ అన్నారు.
ఇదీ చదవండి : గ్రేటర్ పోరు... 68 నామినేషన్లు తిరస్కరణ