మద్దూరు మండలం కొమ్మూరుకు చెందిన ఎల్లమ్మ(32) ఇంట్లో చిన్న గొడవ చోటుచేసుకోవటంతో మనస్తాపం చెందింది. ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్దామని చెప్పి కొడంగల్ మండలం అస్నాబాద్‌కు వెళ్లింది.
ఆ గ్రామంలోని పెద్దచెరువు వద్దకు పిల్లల్ని కాలినడకన తీసుకువెళ్లిన ఎల్లమ్మ.. అక్కడ వారితో కాసేపు మాట్లాడింది. అనంతరం పెద్దకూతురు రజిత(9), కుమారుడు రాజు(5)ను అకస్మాత్తుగా చెరువులో తోసేసింది. మరో పాప అనిత(7)తో పాటు దూకేందుకు ప్రయత్నించగా పాప తప్పించుకుంది. దీంతో ఎల్లమ్మ చెరువులోకి దూకింది. కొంతసేపటికి అనిత చెరువు నుంచి ఏడ్చుకుంటూ గ్రామానికి వస్తుండగా స్థానికులు ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో స్థానికులు చెరువులో వెతకగా రాజు మృతదేహం లభ్యమైంది. చీకటి పడటంతో గాలించేందుకు ఇబ్బందిగా మారింది. ఇవాళ గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులోంచి మృతదేహాలు లభ్యమయ్యాయి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల 3 ప్రాణాలు గాల్లో కలిశాయని స్థానికులు అంటున్నారు.
- ఇదీ చూడండి : రేపు ఎల్బీస్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ