భర్త వేధింపులు భరించలేక భార్య.. కుమారుడితో కలిసి వ్యవసాయ భూమి వద్ద ధర్నాకు దిగింది. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఓంకార్.. సీఆర్పీఎఫ్ విబాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దీప అనే యువతితో 2013లో అతనికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇచ్చారు. వీరికి ఒక కుమారుడు.
కొన్నేళ్ల తర్వాత అదనపు కట్నం తేవాలంటూ దీపను ఓంకార్ వేధింపులకు గురిచేశాడు. అతని కోరిక మేరకు పుట్టింటి నుంచి డబ్బులు తీసుకొచ్చింది. అయినా మార్పు రాకపోగా గర్భవతినని కూడా చూడకుండా తనను శారీరకంగా హింసిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. హింస తట్టుకోలేక కమలాపూర్‌లోని నాయనమ్మ ఇంటికి వెళ్లినట్లు వెల్లడించింది. తాను ఇంట్లో లేని సమయం చూసి తన వస్తువులన్నీ పొలంలో పడేశాడని రోదించింది.
తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని దీప స్పష్టం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధితురాలిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ