హైదరాబాద్ కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో ఓ పాత నేరస్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. చైతన్యపురి ఠాణా నుంచి జామీనుపై వెళ్లిన కొద్ది గంటల్లోనే అతను మృతి చెందాడు. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నట్లుగా సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైంది. మృతుడు పండ్ల మార్కెట్‌లో తరుచుగా దొంగతనాలకు పాల్పడే మల్లాపూర్‌కు చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు.
శుక్రవారం రాత్రి మృతుడు రాజు పూటుగా మద్యం సేవించి అదే పండ్ల మార్కెట్‌లో పనిచేసే కూలీ మహ్మద్ ఫిరోజ్‌తో గొడవపడ్డాడు. తననే అరెస్టు చేయిస్తావా నీ అంతు చూస్తానని బెదిరించాడు. రాజు బెదిరింపులతో రాత్రి చైతన్యపురి పోలీసులకు ఫిరోజ్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే రాజును అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా 400 పాయింట్లకు పైగా రావడం వల్ల అతన్ని ఠాణాలోనే ఉంచారు.
అర్ధరాత్రి 2 గంటలకు రాజును అతని మిత్రుడు కమల్ వ్యక్తి వచ్చి పోలీసులకు జామీను ఇచ్చి తీసుకువెళ్లాడు. మళ్లీ రాజు, కమల్, ఫిరోజ్‌లు ముగ్గురు కలిసి మద్యం సేవించారని.. ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. మద్యం సేవిస్తూ మళ్లీ ఫిరోజ్‌ను రాజు బెదిరించడంతో అతని గొంతుకోసి హత్య చేశాడని.. మొత్తం ఘటనలో ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నారని ఏసీపీ వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రధాన నిందితుడు ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి : రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు కూలీలు