2020లో 3,121 కేసులు నమోదయ్యాయి: ఎస్పీ కోటిరెడ్డి - మహబూబాబాద్ క్రైం వార్తలు
2020 సంవత్సరంలో 3121 కేసులు నమోదయ్యాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. డయల్ 100కు మంచి స్పందన ఉందన్న ఎస్పీ.. రాష్ట్ర సగటు కంటే తక్కువ సమయంలోనే ఘటన స్థలికి చేరుకుంటున్నట్లు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా 2020 సంవత్సర పోలీస్ వార్షిక నివేదిక సావనీర్‌ను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి విడుదల చేశారు. కరోనాతో కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. 2019లో 2,906 కేసులు నమోదు కాగా, 2020లో ఆ సంఖ్య 3,121కు చేరినట్లు వెల్లడించారు.
రహదారి ప్రమాదాలు, గృహహింస కేసులు తగ్గినట్లు తెలిపారు. రెండు పోక్సో, ఐదు దొంగతనం, 90 వ్యక్తిగత దాడుల కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా లేదన్నారు. న్యూ డెమోక్రసీ పార్టీలో 6 దళాలు ఉండగా.. ఐదింటిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
చోరీ కేసుల్లో అర కిలో బంగారు, కిలో వెండి ఆభరణాలు, 33 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రేషన్ బియ్యం పట్టివేత కేసులు గతేడాది మాదిరిగానే ఉన్నాయన్నారు. ఇసుక, గంజాయి, నల్లబెల్లం, గుడుంబా, గుట్కా అక్రమ రవాణా, జూదం, ఈ-చలానా తదితర కేసులు పెరిగినట్లు తెలిపారు.
డయల్ 100 స్పందన బాగుందని.. కాల్ వచ్చిన 20 నిమిషాల్లోపల ఘటన స్థలికి చేరుకోవాలని.. కానీ కేవలం 10 నిమిషాల్లోనే పోలీసులు చేరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమయం రాష్ట్ర సగటు కన్నా తక్కువని తెలిపారు.