హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా చెరువులోకి దిగిన ఇద్దరు బాలల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు.
బండ్లగూడ నూరీనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ రహీం, షేక్ సొహెల్ స్థానికంగా ఉన్న పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. అదే బస్తీకి చెందిన ఆరుగురు స్నేహితులతో కలిసి సమీపంలోని ఉందాసాగర్ చెరువు వద్దకు వెళ్లారు.
స్నేహితులు ఈత కొడుతుంటే.. సరదాగా చెరువులోకి దిగారు. ఈత రాక ఇద్దరూ మునిగిపోయారు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానిక యువకుల సహాయంతో చెరువులో గాలించగా.. రహీం మృతదేహం లభ్యమైంది. సొహెల్ జాడ తెలియలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చాంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్ తెలిపారు.
ఇదీచూడండి: ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడి దుర్మరణం