మహబూబాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. గార్ల మండలం వడ్ల అమృ తండా సమీపంలో వ్యవసాయ బావిలో దూకి ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మంలో పదో తరగతి చదువుతున్న 17 ఏళ్ల ప్రశాంత్, డిగ్రీ చదువుతున్న 21 సంవత్సరాల ప్రవీణ... ఇరువురు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. భయాందోళనకు గురైన ప్రేమజంట సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తండా శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బావిలో శవాలు పడి ఉండటాన్ని చూసిన రైతులు తండావాసులకు సమాచారం అందించారు.
తండా వాసులంతా ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా తమ తండాకు చెందిన వారేనని గుర్తించారు. బంధుమిత్రుల రోదనలతో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న గార్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: ఫేస్‌బుక్ వల.. బాలుని కోసం బాలిక సుదూర ప్రయాణం