ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను అమ్మాయి తరఫు పెద్దలు చంపుతామని బెదిరిస్తున్నారని ఏపీలోని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించాడో యువకుడు. గుంటూరు శారదా కాలనీకి చెందిన దిలీప్ కుమార్.. విజయవాడకు చెందిన ఓ యువతిని జులై 29న చర్చిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి రెండు నెలల గర్భిణీ.
తాను లేని సమయంలో ఇంటికి వచ్చి తన భార్యను.. ఆమె తరఫు పెద్దలు తీసుకువెళ్లిపోయారని దిలీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. పోలీసులు తమనే వేధిస్తున్నారని ఆరోపించారు. అరండల్పేట సీఐ తమను బెదిరించారని దిలీప్, అతని తల్లి రత్నకుమారి ఆరోపించారు. తన భార్యను తిరిగి తమ ఇంటికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని దిలీప్ కోరారు.
'మాది లవ్ మ్యారేజ్. నా భార్య తరపు వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో తనను తీసుకువెళ్లిపోయారు. ఇప్పుడు తాను రెండు నెలల గర్భిణీ. అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. మాపై బెదిరింపులకు దిగారు. అరండల్పేట సీఐ మమ్మల్ని దూషించారు'
-దిలీప్ కుమార్
ఇదీ చదవండి: మణికట్టు కోసుకొని ఆపై ఉరి వేసుకొని.. యువకుడి ఆత్మహత్య