ఏపీ కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన తెదేపా నేత సుబ్బయ్య అంత్యక్రియలు ఇవాళ్టికి వాయిదా పడ్డాయి. బుధవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. అయితే పోలీసులు తాను చెప్పిన పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదంటూ మృతుడి భార్య.. ఆ విషయాన్ని లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. హత్య కేసులో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావ మునిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధ పేర్లను నమోదు చేయలేదని తెలిపారు. ఆ మేరకు.. ఆయా పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ లోకేశ్, తెదేపా నేతలతో కలసి ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో పోలీసులు తెదేపా నేతలతో చర్చలు జరిపారు. నిందితులపై కేసు నమోదు చేయడానికి అంగీకారం తెలిపారు. ఆ మేరకు లోకేశ్ ధర్నాను విరమించారు. బుధవారం రాత్రికి ప్రొద్దుటూరులోనే బస చేసిన లోకేశ్... గురువారం నిర్వహించనున్న సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొంటారు.
ఇదీ చదవండి: మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువకుడు