సంగారెడ్డి జిల్లా బొల్లారం బీసీ కాలనీకి చెందిన వెంకటేష్, యాదగిరి అనే అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా స్థల వివాదం నడుస్తోంది. తండ్రి పంచి ఇచ్చిన స్థలంలో వెంకటేష్‌కి చెందిన 30 గజాల స్థలాన్ని అన్న యాదగిరి ఆక్రమించాడు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. అయితే ఎప్పటికైనా తన సోదరుని వల్ల ఇబ్బంది ఉంటుందని ఆలోచించిన యాదగిరి... ఐదుగురు కిరాయి హంతకులతో లక్ష రూపాయలకు మాట్లాడుకుని ఈ నెల 10న రాత్రి హత్య చేయించాడు.
కొంత నగదు ముందుగానే హంతకులకు యాదగిరి ఇవ్వడం వల్ల వారు వెంకటేష్‌ను ఆటో కిరాయికి రమ్మని పిలిచి జిన్నారం అటవీ ప్రాంతంలో హత్య చేశారు. నిందితులు కిరాయికి మాట్లాడుకున్న మిగతా నగదు ఇచ్చే సమయంలో యాదగిరితో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు నిందితుల నుంచి 6 చరవాణులు, ఒక కత్తి, 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: హుస్సేన్‌సాగర్‌లో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం