హజ్ యాత్ర పేరిట మోసాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1,75,800 స్వాధీనం చేసుకున్నారు.
కేరళకు చెందిన ముస్తఫా అహ్మద్ పాతబస్తీలోని హుస్సేనిఆలం, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్ ప్రాంతాలకు చెందిన ఏడు మందితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. అహ్మద్ తనను తాను దుబాయి షేక్ అంటూ ప్రచారం చేసుకున్నాడు. హుస్సేనిఆలం ప్రాంతంలో ఓ కార్యాలయం ప్రారంభించి యాత్రికులను హజ్ పంపిస్తానని పలువురిని నమ్మించాడు. ఇందుకోసం ఒక్కొక్కరి వద్ద నుంచి రిజిస్ట్రేషన్ కోసం రూ. 500 వసూలు చేశాడు. అతని మాటలు నమ్మి దాదాపు 500 మంది డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం కొవిడ్ పరీక్షల పేరిట మరో రూ. 2500 చొప్పున వసూలు చేశాడు.
అహ్మద్ దుబాయి షేక్ కాదని తెలుసుకున్న బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అతని కార్యాలయంపై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి డబ్బులు చెల్లించిన రసీదులు, దరఖాస్తు కాగితాలు, కరోనా పరీక్ష కిట్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: విజయశాంతితో భేటీ అయిన మాణికం ఠాగూర్