మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఓ ప్రముఖ టీవీ ఛానెల్ జర్నలిస్టు రంజిత్ కుమారుడు దీక్షిత్‌రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశారు. రాత్రి అయినా ఇంటికి రాకపోక.. తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఓ వ్యక్తి బైకుపై వచ్చి దీక్షిత్‌ను తీసుకెళ్లారని తనతో ఆడుకున్న మిత్రులు తెలిపారు. ఆదివారం రాత్రి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన కిడ్నాపర్లు రూ. 45 లక్షలు డిమాండ్ చేశారు.
'పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొద్దు.. మీ ఇంటి పరిసరాల్లో మా వ్యక్తులు ఉన్నారు. మీరు ఏం చేస్తున్నది మాకు తెలుస్తుంది. మీ బాబుకు జ్వరంగా ఉంది. మాత్రలు కూడా వేశాం' అని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు రంజిత్ తెలిపారు. పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేయగా.. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి బాబు కిడ్నాపయిన ఇంటి ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజీలను పరిశీలించి పలువురు అనుమానితులను ప్రశ్నించారు. పట్టణంలో ముమ్మరంగా గాలిస్తున్నారు.
కిడ్నాపర్లు ఇప్పటివరకు నాలుగు సార్లు నెట్ ఫోన్లతో ఫోన్ చేయగా.. పోలీసులు వారి ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి... దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులకు సూచించారు.
ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకున్న రెండు లక్షల మంది బాధితులు