సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అంతర్రాష్ట్ర దొంగను కోదాడ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కోదాడ డీఎస్పీ రఘు వివరాలను వెల్లడించారు.
కొద్ది రోజులుగా కోదాడ పట్టణంలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న విజయవాడకు చెందిన కొర్రపాటి వీర నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు, 56 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి నాగరాజు దొంగతనాలకు పాల్పడేవాడని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గతంలో కోదాడలో బంగారు నగల చోరీ కేసులో జైలుకు సైతం వెళ్లొచ్చాడని తెలిపారు. నిందితుడిని జ్యుడీషియల్ కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీచూడండి.. బోధన్ బిగ్సీ షోరూంలో చోరీ.. మొబైల్ఫోన్లు, నగదు అపహరణ